Amaravati Lands : అమరావతి రాజధాని ప్రాంతంలో భారీ ఎత్తున ఇళ్ళ పట్టాల పంపిణికి జగన్ సర్కార్ చర్యలు చేపట్టింది. సీఆర్డీఏ పరిధిలో 50,793 మంది పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నారు. క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటి ప్రాంతంలో రూ. 443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా ఇదే సమయంలో ఆయా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం కేటాయించనుంది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో శుక్రవారం నాడు లాంఛనంగా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి.. ప్రారంభించనున్నారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇంటి స్దలాల కేటాయింపు వ్యవహరం తీవ్ర స్దాయిలో రాజకీయ వివాదానికి కారణం అయ్యింది. దీని పై అధికార ,ప్రతి పక్షాల మద్య మాటల యుద్దం నడిచింది.
పేద అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని.. వారి ముఖాల్లో సంతోషం చూడాలని.. వారికి ఒక గూడు ఏర్పడాలని.. వారి భవిష్యత్తు బాగుండాలని..కృత నిశ్చయంతో అడ్డంకులన్నీ అధిగమించి మరి ఇచ్చిన మాట ప్రకారం పేదలకు ఇంటి స్దలాన్ని కేటాయించామని ముఖ్యంమంత్రి జగన్ అన్నారు. పేదల పక్షాన నిలబడి నేడు 50,793 మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి అదికారంలోకి వచ్చాక టిడ్కో ఇంటి కేటాయింపులు అంశం పై కూడ వివాదం నెలకొంది.దీంతో ప్రభుత్వం వాటినికి కూడ అధిగమించి పంపిణి కి చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 1,43,600 మంది లబ్ధిదారులకు 300 చ॥అ॥ ల టిడ్కో ఇళ్లు కేవలం 1 రూపాయికే అన్ని హక్కులతో అంద చేసేందుకు జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీని ద్వార రాష్ట్రవ్యాప్తంగా రూ.9,406 కోట్ల మేర లబ్ధి కలుగుతుందని సర్కార్ ప్రకటించింది.
గత ప్రభుత్వంలో ఇదే ఇంటికి అసలు, వడ్డీలతో కలిపి ఒక్కొక్కరు రూ. 7.20 లక్షలు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందని, లబ్ధిదారులు చెల్లించాల్సిన ముందస్తు వాటా సొమ్ములో 50 శాతాన్ని రాయితీగా అందిస్తూ, 365 చ॥అ|| ల టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు 44,304 మందికి ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున, 430 చ||అ॥ల 74,312 టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు రూ. 50 వేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా లబ్దిదారులు చెల్లించాల్సిన రూ. 482 కోట్ల భారాన్ని కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం భరించింది. టిడ్కో ఇళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్లు.. తద్వారా ఒక్కో లబ్ధిదారుడికి రూ. 60 వేల లబ్ధి కలిగిందని,రాష్ట్రవ్యాప్తంగా 2.62 లక్షల మంది టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు సబ్సిడీ రూపంలో రూ. 14,514 కోట్లు, ఉచిత రిజిస్ట్రేషన్ల రూపంలో రూ. 1200 కోట్లు, మౌలిక సదుపాయాలకు మరో రూ. 3,000 కోట్లు కలిపి మొత్తంగా రూ. 18,714 కోట్ల లబ్ధి ని ప్రభుత్వం చేకూర్చింది. గత ప్రభుత్వం ఈ టిడ్కో ఇళ్లలో మంచినీటి సదుపాయాలు, రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ లాంటి మౌలిక వసతులను నిర్లక్ష్యం చేస్తే, అన్ని మౌలిక సదుపాయాలతో ఇళ్లను కేటాయించింది.
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల ద్వారా సీఆర్డీఏ పరిధిలో అన్ని మౌలిక సదుపాయాలతో మొత్తం 25 లేఅవుట్లు సిద్దం చేశారు. 23,762 మంది గుంటూరు జిల్లా లబ్దిదారులకు 11 లేఅవుట్లు, 27,031 మంది ఎన్టీఆర్ జిల్లా లబ్దిదారులకు 14 లేఅవుట్లు..రెడీ అయ్యాయి.80,000 హద్దు రాళ్ల ఏర్పాటు చేసి, 95.16 కి.మీలలో గ్రావెల్ తో అంతర్గత రవాణా వ్యవస్థ నిర్మాణం చేపట్టారు. సీఆర్డీఏ పరిధిలోని ఈ పేదల హౌసింగ్ కాలనీల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా, ఇళ్ల నిర్మాణానికి మరో రూ. 1,280 కోట్లు, మౌలిక సదుపాయాలకు మరో రూ. 700 కోట్లు.. మొత్తం దాదాపు రూ.2,000 కోట్ల వ్యయంతో "వైఎస్సార్ జగనన్న కాలనీ"ల నిర్మాణం చేపట్టారు.ఇళ్ల పట్టాలు పొందడంలో ఏ రకమైన ఇబ్బందులున్నా టోల్ ఫ్రీ నంబర్ 1902ను సంప్రదించ వచ్చని సర్కార్ స్పష్టం చేసింది.