AP CM Chandrababu key decision over incident in Sri Sathyasai District | అమరావతి: రాష్ట్రంలో మహిళలపై నేరాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. శ్రీసత్యసాయి జిల్లా  చిలమత్తూరు మండలం, నల్లబొమ్మనిపల్లిలో అత్తాకోడళ్లపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. నిందితులకు తక్షణం శిక్షలు పడేలా చేయాల్సిన అవసరం ఉందని భావించిన చంద్రబాబు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి కేసును విచారించాలని సూచించారు. దీని కోసం హైకోర్టుకు విన్నవించి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేద్దామన్నారు. 


ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ


గతంలో బాపట్ల జిల్లాలో మహిళపై సామూహిక అత్యాచారం, హత్య ఘటనపై సైతం ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరిపించాలని సూచించారు. లైంగిక వేధింపులు, మహిళలపై దాడి వంటి అంశాలలో త్వరగా న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ విధానం అని చంద్రబాబు స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ఘటనలో ఇప్పటికే పలు కీలకాంశాలను దర్యాప్తు బృందం రాబట్టిందన్నారు. నిందితులు దొంగతనాలతో పాటు అత్యాచారానికి పాల్పడుతున్నారని విచారణలో తేలిందన్నారు. మహిళలపై జరిగే నేరాలలో నిందితులకు ఖచ్చితంగా, వేగంగా శిక్ష పడాలన్నారు. శిక్ష తప్పదనే భయం నేరగాళ్లలో రావాలన్నారు. నేరగాళ్లను గుర్తించి, కఠినంగా శిక్షలు వేయడానికి టెక్నాలజీ ద్వారా సాక్ష్యాలను సేకరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. 


సీసీ కెమెరాలు, ఇతర టెక్నాలజీ సాయం తీసుకోవాలి


రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటానికి, మహిళలకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నేరస్తులను పట్టుకోవడంలో సిసి కెమెరాలు సహా ఇతర టెక్నాలజీ అంశాలను వాడుకోవాలని చంద్రబాబు సూచించారు. నేరస్తులను వెంటనే గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల సంఖ్యను పెంచే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. నేరాలను అరికట్టేందుకు ప్రజల సహకారం కూడా తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా లైంగిక వేధింపులు, ఘర్షణలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగితే ఆధారాలను పోలీసులతో పంచుకోవాలని సూచించారు. 


ప్రజల సహకారంతో నేరాలకు మరింత సమర్థవంతంగా అడ్డుకట్ట వేయవచ్చని సిఎం చంద్రబాబు అన్నారు. పోలీసులకు సమాచారం పంపిన వారి వివరాలపై పూర్తిగా గోప్యత పాటిస్తామని నమ్మకం కల్పించాలని పోలీసు శాఖకు సూచించారు. ప్రజల ప్రాణాలకు, మహిళల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రంలో ప్రతి మహిళ స్వేచ్ఛగా తిరిగేలా శాంతి భద్రతలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.


Also Read: Crime News: పండుగ పూట దారుణం- అత్త, కోడలుపై సామూహిక అత్యాచారం - బాధితులకు అండగా ఉంటామన్న బాలకృష్ణ 


అసలేం జరిగిందంటే..
శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం నల్లబొమ్మినిపల్లిలో ఓ కంపెనీలో వాచ్ మెన్‌గా చేస్తున్న వ్యక్తి తన ఫ్యామిలీతో నివాసం ఉంటున్నారు. అర్ధరాత్రి ఓ వ్యక్తి అటుగా వస్తున్నట్లు గమనించి లైట్ వేసి చూసి ఎవరు అని అడిగాడు. అంతలోనే కొందరు యువకులు అక్కడికి చేరుకుని ఆ వ్యక్తి వాచ్ మెన్ పై దాడి చేశాడు. అతడి కొడుకు వచ్చి అడగగా, అతడిపై కూడా దాడి చేశారు. వారిని కత్తులతో బెదిరించి ఇంట్లో ఉన్న అత్తాకోడలుపై సామూహిక అత్యాచారం చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకన్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.