కోటి విద్యలు కూటి కొరకే అంటారు. మనం ఎంత కష్టపడినా ఏం చేసినా ఆకలి కష్టాలు మాత్రం ఉండకూడదని భావిస్తాం. ఆకలితో ఉన్న వారికి పట్టెడన్నం పెట్టని నేటి రోజుల్లో ఆపద్బాంధవులు మాత్రం ఇంకా ఉన్నాం అంటూ ముందుకొస్తున్నారు. అనంతపురంలోని స్పందన ట్రస్టు ఇందుకు నిదర్శనం. భోజనం బాగా ఖరీదయిన నేపథ్యంలో చాలామంది సమయానికి తినడానికి డబ్బుల్లేక నానా ఇబ్బందులు పడుతున్నారు.
గత ప్రభుత్వం ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసినపుడు చాలామంది వాటిని ఉపయోగించుకున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అన్న క్యాంటీన్లు మూసివేయడం ద్వారా చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారు. వీటన్నిటిని చూసి చలించిపోయిన స్పందన ట్రస్టు అభాగ్యులను ఆదుకొనేందుకు ముందకు వచ్చింది. ఐదు రూపాయలకే భోజనం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అనంతపురం బస్టాండ్ సమీపంలో రూ.5 కే భోజనం అందించే స్టాల్ ను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు ఈ భోజన స్టాల్ తెరవనున్నారు.
ఇక్కడికి వచ్చే వారు భోజన ఖర్చులు భరించే వారు కాకుండా, ఏమీలేని నిరుపేదలకు మాత్రమేనన్నది గుర్తించాలంటున్నారు. ఎందుకంటే వారికోసం ఏర్పాటు చేసిన హోటల్ కనుక మామూలు భోజన ఖర్చు భరించే శక్తి ఉన్న వారు ఇక్కడికి వచ్చి మరొకరి పొట్ట కొట్టకుండా చూడాలంటున్నారు నిర్వాహకులు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ భోజనాన్ని వినియోగించుకుంటున్నారని, రానున్న రోజుల్లో అనంతపురం పట్టణంలోనే కాదు... ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మరిన్ని తెరిచేందుకు ప్రయత్నిస్తామంటున్నారు స్పందన ట్రస్టు నిర్వాహకులు. ఇక్కడికి వచ్చి బోజనం చేసేవారు కూడా క్వాలిటీ భోజనం అందిస్తున్నారని చెబుతున్నారు. ప్రతిరోజూ మూడువందల మందికి ఈ భోజనం అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు.
చరణ్ నందా ఆద్వర్యంలో స్పందనా ట్రస్టు గతంలో కూడా అనేక సహాయ సహాకారాలు చేపట్టారు. కోవిడ్19 వ్యాప్తి చెందుతున్న ఫస్ట్, సెకండ్ వేవ్ సమయంలో కూడా మరణించిన వారి మృతదేహాలను తరలించడం, అనాథ శవాల దహన సంస్కారాలు... మానసిక వికలాంగులకు అవసరమైన సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు చరణ్ నందా మిత్ర బృందం. గతంలో కూడా హాస్పటల్ సమీపంలో రెండురూపాయలకే ఇడ్లీ సెంటర్ ను ఏర్పాటు చేశామని, కానీ కరోనా నేపథ్యంలో అది మూసేశామన్నారు. ప్రస్తుతం మాత్రం ఐదు రూపాయల భోజనం స్టాల్ మాత్రం అనేక మార్లు ఎక్కడ పేదలుంటారన్నది పరిశీలించిన తరువాతే ఇక్కడ స్టాల్ ను ఏర్పాటు చేశామంటున్నారు నిర్వాహకులు. సో చరణ్ నందా మితృబృందం చేస్తున్న సహాయ కార్యక్రామాలను అనంతపురం వాసులు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు.
Also Read: Weather Updates: బీ అలర్ట్.. నేడు సైతం ఏపీ, తెలంగాణలో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు.. అక్కడ చలికి గజగజ