Kurnool Murder Case: మేఘాలయలో ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధం పెట్టుకున్న వివాహిత తన భర్తను హనీమూన్‌కు తీసుకెళ్లి ఖతం చేసింది. ఈ కేసు ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అలాంటి కేసే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. పెళ్లైన కొద్దిరోజులకే గద్వాలకు చెందిన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ముందు అదృశ్యమయ్యాడని కేసు నమోదు చేసుకున్న పోలీసులు తర్వాత కూపీ లాగితే కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో కుటుంబ సభ్యులతోపాటు ఓ బ్యాంకు మేనేజర్ పాత్ర ఉందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ముఖ్యంగా భార్య పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

గద్వాల రాజవీధిలో ఉంటున్న ప్రైవేటు సర్వేయర్‌ తేజేశ్వరరావు ఈ మధ్య కాలంలో కల్లూరు యువతిని ప్రేమించాడు. ఈ మధ్యే వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం కర్నూలు జిల్లా పాణ్యం వెళ్లిన తేజేశ్వరరావు కనిపించకుండా పోయాడు. ఈ విషయంపై కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. 

గంట తేజేశ్వరరావు ఆఖరి సిగ్నల్‌ పాణ్యం చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నట్టు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులను విచారిస్తే కీలకాంశాలు చెప్పారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో తేజేశ్వర్‌ హత్యకు గురైనట్టు గుర్తించారు. వారు చెప్పిన ఆధారాలంతో డిగ్ చేస్తే పాణ్యం సమీపంలోని పిన్నాపురం చెరువు వద్ద తేజేశ్వర్‌ మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. 

మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు పోస్టు మార్టం పూర్తి చేశారు. తేజేశ్వర్‌ను అత్యతం కిరాతకంగా హత్య చేసినట్టు పోస్టు మార్టం రిపోర్టులో తేలింది. కారులో తీసుకెళ్లిన హంతకులు అక్కడే గొంతు కోసి హతమార్చారు. నన్నూరు టోల్‌ప్లాజా మీదుగా పాణ్యం మండలం పిన్నాపురం రోడ్డులో పడేశారు. అయితే కారులో వచ్చింది ఎవరు, ఎంత మంది వచ్చారు, వారిని ఎవరు పురమాయించారనే విషయాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 

ఇప్పటికి ఈ కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు తేజేశ్వర్ హత్యకు కేవలం వివాహేతర సంబంధమే కారణంగా అనుమానిస్తున్నారు. తేజేశ్వరరావు భార్యతో కర్నూలు టీజే మాల్‌లో ఉన్న కెనరా బ్యాంకు మేనేజర్‌ తిరుమలరావు వివాహేతర సంబంధం ఉందని అంటున్నారు. ఈ విషయంలో తేజేశ్వర్‌ అత్త కూడా హెల్ప్ చేశారని సమాచారం. వివాహానికి ముందు నుంచే తతంగం నడుస్తోంది. 

తన సంబంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వరరావును హత మార్చేందుకు పెళ్లైన నెలరోజులకు భార్య స్కెచ్ వేసినట్టు పోలీసులు గుర్తించారు. బ్యాంకు మేనేజర్‌తో కలిసి ప్లాన్ చేసినట్టు, వీళ్లకు అత్త సహకరించినట్టు అనుమానిస్తున్నారు. పథకంలో భాగంగా ల్యాండ్‌ సర్వే కోసం తేజేశ్వరరావును కర్నూలుకు రప్పించారు. రప్పించే క్రమంలో మార్గ మధ్యలోనే హతమార్చారు. సర్వేకు వెళ్లిన తన బ్రదర్ కనిపించడం లేదని తేజవర్థన్‌ గద్వాల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

తేజేశ్వరరావు హత్య కేసులో అసలు నిందితులను పట్టుకునేందుకు గద్వాల్ పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. కీలక నిందితులు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  

మృతుడు సోదరుడు మీడియాతో మాట్లాడుతూ ఇదంతా తన తమ్ముడి భార్యే చేసిందని అంటున్నాడు. మొదట తన తమ్ముడితో వివాహం నిశ్చేయైందని కానీ పెళ్లికి ఐదు రోజుల ముందే తను కనిపించకుండా పోయిందన్నాడు. అప్పుడు ఆరా తీస్తే వేరే వాళ్లతో వెళ్లిపోయినట్టు చెప్పుకొచ్చాడు. ఆ పెళ్లి వద్దనుకున్నామని కానీ మళ్లీ తమ తమ్ముడిని ట్రాప్ చేసిందని చెప్పాడు. కట్నం తల్లి ఇచ్చుకోలేదని అందుకే తాను అప్పుడు వెళ్లిపోయినట్టు కలరింగ్ ఇచ్చి బుట్టలో వేసుకుందని తెలిపాడు. తర్వాత తమకు ఇష్టం లేకపోయినా వారిద్దరు గత నెల 18న పెళ్లి చేససుకున్నారని వివరించాడు. అప్పటి నుంచి వారితో సంబంధం తెంచుకున్నానని కానీ ఇంతలో తమ్ముడు కనిపించడం లేదని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నాడు. భర్త చనిపోయిన భార్య ఎలా ఉంటుందో అందరికీ తెలుసని కానీ తన తమ్ముడి భార్య మొహంలో బాధ లేదని తెలిపాడు. అందుకే పోలీసులకు ఆమె, ఆమె ఫ్యామిలీపై ఫిర్యాదు చేశానని అన్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఏం తేలుస్తారో చూడాలని చెప్పుకొచ్చాడు.