ఏపి ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సొంత నియోజకవర్గంలో డోన్‌లో వలసల పర్వం మొదలైంది. మంత్రి డోన్ నియోజకవర్గ పరిధిలోనే పర్యటనలో ఉండగానే ఆయన ముఖ్య అనుచరుడైన ధార హరనాథ్ రెడ్డి కండువా మార్చేశారు. నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, డోన్ నియోజకవర్గ టిడిపి ఇంచార్జీ సమక్షంలో సైకిల్ చేరారు.
డోన్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో 32వ వార్డు వైస్సార్సీపీ తరుపున హరనాథ్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటూ పార్టీకి సేవలు అందించారు. కౌన్సిలర్ హరనాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడానికి అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ మంత్రి పక్కన ఉంటూ ఆయనకు భజన చేసే వ్యక్తులకు మాత్రమే విలువలు ఇస్తున్నారని హరనాథ్ అనుచరులు చెవుళ్లు కొరుక్కుంటున్నారు. ఆయన ఒక్కరే కాదు డోన్ కౌన్సిలర్ల చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారని టాక్.
ఆర్థికశాఖ మంత్రి డోన్ నియోజకవర్గ పరిధిలో పర్యటనలో ఉండగానే ఆయన ముఖ్య అనుచరుడు 32వ వార్డు కౌన్సిలర్ ధార హరనాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడంతో డోన్ వైసీపీలో కలకలం రేపుతోంది. వార్డు కౌన్సిలర్‌తోపాటు మరి కొంతమంది కూడా టీడీపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. పార్టీ కార్యకర్తల్లోనూ, అటు ప్రజాల్లోనూ అసంతృప్తి కనిపిస్తోందని విపక్ష నేతలు చెబుతున్నారు.
రాబోయే ఎన్నికల్లో డోన్ నియోజకవర్గ పరిధిలో వైసీపీకి గట్టి షాక్ ఇస్తామంటున్నారు నేతలు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సొంత మండలం బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చి 6వార్డులు కైవసం చేసుకుని బుగ్గన కోటకు బీటలు వారేలా చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రికి ముఖ్య అనుచరుడిగా పార్టీకి అండగా ఉంటూ పార్టీకి సేవలు చేశారు. అటువంటి వ్యక్తే ఊహించని విధంగా టిడిపిలో చేరి మంత్రికి ఊహించని షాక్ ఇచ్చారు. తన నుంచే వలసలు మొదలవుతాయని హరినాథ్ రెడ్డి తెలిపారు.
డోన్‌లో వైసీపీ పార్టీలోనే ఉంటూ చాలా మంది కౌన్సిలర్లు కూడా విలువలు లేక మగ్గుతున్నారని వారు బాధలు బయటికి చెప్పుకోలేక పోతున్నారని వైసీపీకి పతనం 32వ వార్డు నుంచి మొదలైందని అన్నారు హరినాథ్‌రెడ్డి. డోన్ టీడీపీ ఇన్చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి తనకు ఎటువంటి ప్రలోభాలకు గురి చేయలేదని, తానంతట తానే స్వయంగా తెలుగుదేశం పార్టీలో చేరానని ఆయన అన్నారు. ప్రస్తుతానికి 32 వ వార్డు నుంచి తాను ఒక్కడినే పార్టీలో చేరానని ఇప్పటి నుంచి వైసిపికి ముందు ముందు ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు. మొత్తం మీద మంత్రి బుగ్గనకు ముఖ్య అనుచరుడు సడన్ గా టిడిపిలోకి జంప్ కావడంపై జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.