కర్నూలు జిల్లా పత్తికొండ అర్బన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌ హద్దుమీరి ప్రవర్తించారు. నిన్న సాయంత్రం ఆదోని రోడ్డులో ఓ వ్యక్తిపై చేయి చేసుకున్నారు. నిబంధనలు పాటించకుంటే ఫైన్ వేయాల్సింది పోయి... దుర్భాషలాడుతూ చేయి చేసుకోవడం అక్కడి వారందర్నీ ఆశ్చర్య పరిచింది. 


హెడ్ కానిస్టేబుల్ జయన్న నిన్న సాయంత్రం ఆదోని రోడ్డు పుష్ప హాస్పిటల్ సమీపంలో పందికొన గ్రామానికి చెందిన వసంత కుమార్‌పై ఇష్టారీతిన ప్రవర్తించి భౌతిక దాడికి దిగారు. వంసత్‌ కుమార్‌ టూ వీలర్ పై వస్తుండగా పత్తికొండ టౌన్‌లోకి రాగానే హెడ్‌కానిస్టేబుల్‌ ఆపారు. ఆపుతుండగానే స్కూటర్‌పైఉన్న వసంత కుమార్‌పై దుర్భాషలాడారు హెడ్ కానిస్టేబుల్ జయన్న. తిట్లదండకం అందుకున్నారు. 


అంతటితో ఆగకుండా కానిస్టేబుల్ వసంత కుమార్‌పై భౌతిక దాడికి దిగారు. ఇష్టం వచ్చినట్టు పిడుగుద్దులు గుద్దారు. కాలితో తన్నారు. వసంత కుమార్ టూ వీలర్ వాహనాన్ని, సెల్ ఫోన్ లాక్కొని స్టేషన్ తీసుకెళ్లారు హెడ్ కానిస్టేబుల్ జయన్న.
స్కూటర్‌పై వచ్చే వ్యక్తి నిబంధనలు పాటించకుంటే ఫైన్‌ వేయాలే కానీ ఇలా కొట్టడమేంటని అక్కడి వారు ప్రశ్నించారు. రోడ్డుపై కొట్టడంతో అక్కడి వారంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. 


సామాన్య ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్, ఓ సామాన్యుడు పై రోడ్డుపై చితకబాదిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న సాయంకాలం ఆరు గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా అని వసంత్‌ నిలదీశారు. కానిస్టేబుల్‌ చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తీవ్ర విమర్శల పాలైంది.