కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పిల్లలను అర్ధరాత్రి నడిరోడ్డుపై వదిలి వెళ్లిపోయాడో తండ్రి. ఓ వైపు మద్యం మత్తు మరో వైపు భార్యపై అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. చిన్నారులు రాత్రంతా చలికి వణికిపోతూ.. రోడ్డుమీదే ఉండిపోయారు. భార్య మీద కోపంతో పిల్లలను ఎందుకలా వదిలేసిన ఈ ఘటన కర్నూలు జిల్లా కోడుమూరులో జరిగింది. చాలా ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న కృష్ణ, సుజాతకు ఐదుగురు సంతానం. వారిలో ఒక కుమార్తె కాగా.. నలుగురు కుమారులు. ఈ క్రమంలోనే వీరిని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఇవి చాలవన్నట్లు కృష్ణ మద్యానికి బానిసయ్యాడు. ఎప్పుడైతే మద్యానికి బానిస అయ్యాడో అప్పటి నుంచి భార్యపై విపరీతమైన అనుమానం పెంచుకున్నాడు.
పిల్లలతో సహా ఆటోను కాల్వలోకి తోసిన తండ్రి..
ప్రతిరోజూ తాగొచ్చి భార్యతో గొడవ పడేవాడు. ఇష్టమొచ్చినట్లుగా కొట్టి నిద్రపోయేవాడు. అయితే సోమవారం రాత్రి కూడా కృష్ణ ఫుల్లుగా తాగొచ్చాడు. మద్యం మత్తులో ఊగుతూనే భార్యతో గొడవ పడ్డాడు. మూడేళ్ల కుమారుడు బండు, ఐదేళ్ల తనయుడు మహేంద్రతో సహా భార్యను ఆటోలో ఎక్కించుకొని ఊరికి దూరంగా వెళ్లాడు. కొంతదూరం వెళ్లాక భార్యను ఆటోలోంచి దింపేసి ఆమెపై మరోసారి దాడి చేశాడు. అయితే సుజాత స్పృహ తప్పి పడిపోవడంతో.. అక్కడే వదిలేసి పిల్లలు ఉన్న ఆటోను తీస్కొని వెళ్లిపోయాడు. కొంతదూరం వెళ్లాకా.. ప్యాలకుర్తిలోని దిగువ కాల్వ గట్టులోకి పిల్లలు ఉన్న ఆటోను తోసేసి అతను పారిపోయాడు. కాలువ గట్టున ఆటో ఆగిపోవడంతో ప్రమాదం తప్పింది. భయపడి ఆటోలోంచి దిగిపోయిన చిన్నారులిద్దరూ రోడ్డుపైకి వచ్చి ఏడవడం ప్రారంభించారు. అభం శుభం తెలియని ఆ చిన్నారులో చలిలో వణికిపోతూనే ఉదయం వరచు వేచి చూశారు.
పిల్లలు తల్లి గురించి చెప్పడంతో.. ఆమెను కూడా కాపాడిన పోలీసులు!
అయితే పొలం పనుల కోసం వేకువజామునే అటుగా వచ్చిన రైతు లక్ష్మీ నారాయణ.. ఆ పిల్లల ఏడుపు విని వారి దగ్గరకు వెళ్లాడు. కాసేపు వారిని బుజ్జగించి.. పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన రంగంలోకి దిగిన హైవే పోలీసులు.. చిన్నారులను చేరదీశారు. పిల్లలు తమ తల్లి గురించి చెప్పగా పోలీసులు వెళ్లి రక్షించారు. మంగళవారం కృష్ణను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. భార్యాభర్తలిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి.. పిల్లలను వారికి అప్పగించారు. అయితే ఈ ఘటన గురించి తెలుసుకున్న బాలల సంరక్షణ నిర్వాహకులు చిన్నారులను చేరదీసేందుకు ముందుకు వచ్చారు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మానవ సంబంధాలు మంట కలుస్తున్న వేళ..
నెల్లూరు జిల్లా కావలి పట్టణం గాయత్రి నగర్ లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. సీఐఎస్ఎఫ్ ఏఎస్సైగా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన కోటేశ్వరరావు ఆస్తి కోసం కన్నతల్లిని కిడ్నాప్ చేశాడు. విశ్రాంతి ఏఎస్సై చేసిన ఘనకార్యం ఇదే మొదటిది కాదు. అంతకు ముందు కూడా ఆయన ఇలాగే ప్రవర్తించాడు. ఆస్తి కోసం పలు మార్లు కన్న తల్లినే తీవ్రంగా కొట్టిన చరిత్ర కోటేశ్వర రావుది. కోటేశ్వర రావు తల్లి పేరు మహా లక్ష్మమ్మ. ఆమె వయస్సు 85 ఏళ్లు. గతంలో కోటేశ్వర రావు ఆస్తి కోసం తల్లి మహా లక్ష్మమ్మపై దాడికి పాల్పడ్డాడు. కన్న తల్లి అని కూడా చూడకుండా, వృద్ధురాలు అనే దయ లేకుండా నీచంగా ప్రవర్తించాడు. తీవ్రంగా కొట్టడంతో ఆమె తన కూతురు వద్దకు వచ్చి తల దాచుకుంటోంది.