High Tension In Chandrababu Tour : కర్నూలు న్యాయ రాజధానిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్లాలని కర్నూలు న్యాయవాదులు డిమాండ్ చేశారు. కర్నూల్ నగరంలోని ఓ హోటల్ లో చంద్రబాబు పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నారు. అక్కడికి చేరుకున్న న్యాయవాదులు చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. న్యాయవాదులను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. టీడీపీ నేతలతో న్యాయవాదులు వాగ్వాదానికి దిగారు. చంద్రబాబు కర్నూలు టీడీపీ కార్యాలయంలో జరిగే కార్యక్రమానికి రాకముందే లాయర్లు అక్కడకు చేరుకున్న న్యాయవాదులు ఆందోళనకు చేశారు. రాయలసీమ జేఏసీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. పెద్ద సంఖ్యలో నిరసనకారులు టీడీపీ కార్యకర్తలకు అక్కడకు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
చంద్రబాబు ఆగ్రహం
న్యాయవాదుల నిరసనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదుల ముసుగులో వైసీపీ కార్యకర్తలు అలజడి సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. పోలీసులు అదుపు చేయలేకపోతే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని హెచ్చరించారు. వైసీపీ నేతలు గూండా రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
పోలీసులకు చేతకాకపోతే నేనే వస్తా
"గూండాలందరినీ హెచ్చరిస్తున్నా జాగ్రత్తగా ఉండాలి. దాడులకు పాల్పడిన వారిని తరిమి తరిమి కొడతాం. పోలీసుల వల్ల కాకపోతే చెప్పండి నేను వస్తా. తమాషా అనుకున్నారా వైసీపీ చోటామోటా రౌడీలు ఇలా దాడులకు పాల్పడుతుంటే పోలీసులు ఏంచేస్తున్నారు. బట్టలిప్పించి కొట్టిస్తా దద్దమ్మలారా? పనికిమాలిన వ్యక్తుల్లారా నేరాలు-ఘోరాలు చేసిన దరిద్రులారా అంటూ చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను రౌడీలకు రౌడీని గుర్తు పెట్టుకోండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి సహనం పాటిస్తున్నాం. మా కార్యకర్తలకు పిలుపునిస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది. మేం అధికారంలో ఉన్నప్పుడు ఇలానే చేస్తే మీ జగన్ ఇంట్లో నుంచి బయటికి వచ్చేవాడా?.ఎవడ్రా రాయలసీమ దోహి, రాయలసీమను రత్నాల సీమను చేసాం. రాయలసీమకు ద్రోహం చేసింది జగన్. " - చంద్రబాబు
తరిమి తరిమి కొట్టిస్తా
"టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడతారా? కుప్పంలోనూ ఇలానే దాడికి పాల్పడ్డారు. మేం అధికారంలో ఉన్నప్పుడు ఇలానే చేస్తే మీరు రోడ్లపై తిరిగేవారా?. విశాఖలో ఉత్తరాంధ్ర వాసుల మధ్య చిచ్చుపెట్టారు. ఇప్పుడు రాయలసీమలో గొడవలు పెడుతున్నారు. నా పర్యటనలో రాళ్ల దాడులు చేస్తున్నారు. పోలీసులు వ్యవస్థ నాశనం అయింది. అందుకే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి. సీఎం జగన్ మతాలు, కులాల మధ్య చిచ్చుపెడుతున్నారు. వైసీపీ గూండాలు గుర్తుపెట్టుకోండి తరిమి తరిమి కొట్టిస్తాను. మర్యాదకు మర్యాద దెబ్బకు దెబ్బ. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు నా ప్రాణం పోయినా పర్లేదు. నన్ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. "- చంద్రబాబు
కర్నూలులో హైకోర్టు బెంచ్
40 ఏళ్ల రాజకీయాల్లో ఎన్నిసార్లు కర్నూలుకు వచ్చానని, ఇంత స్థాయిలో రెస్పాన్స్ ఎప్పుడూ రాలేదన్నారు చంద్రబాబు. అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు కర్నూలును మహానగరం తీర్చిదిద్దేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కర్నూలు ఎయిర్ పోర్టు, పారిశ్రామిక వాడ, హంద్రీనీవా, ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్, టిడ్కో ఇళ్లు, ఎల్ఎల్సీ, ఇలా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నా్రు. టిడ్కో ఇళ్లు 90 శాతం పూర్తిచేశామని, పది శాతం పూర్తి చేయలేకపోయారని సీఎం జగన్ పై విమర్శలు చేశారు. వైసీపీ నేతల దాడులకు తాను భయపడనన్నారు చంద్రబాబు. ఆ రోజు అమరావతికి ఒప్పుకున్న జగన్ ఇప్పుడు మాటమార్చారని మండిపడ్డారు. కర్నూల్ లో హైకోర్టు బెంచ్ పెట్టతామన్నారు. కర్నూలు టూర్ లో వస్తున్న రెస్పాన్స్ చూసి తట్టుకోలేకే వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు.