Tarakratna Health Update :అస్వస్థతకు గురైన హీరో నందమూరి తారకరత్నను కుప్పం నుంచి బెంగుళూరుకు గ్రీన్ ఛానల్ లో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మెరుగైన వైద్యం అందించేందుకు బెంగుళూరులోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఎయిర్ లిప్టింగ్ చేసే అవకాశం లేనందున గ్రీన్ ఛానల్ ద్వారా తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. కుప్పం నుంచి బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలిస్తున్నారు. గ్రీన్ ఛానల్ పై కర్ణాటక ప్రభుత్వంతో టీడీపీ అధినేత చంద్రబాబు చర్చించారని టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి తెలిపారు. అంబులెన్స్ కు ఎలాంటి ఆటంకాలు రాకుండా గ్రీన్ ఛానల్ తరహాలో తారకరత్నను బెంగళూరు తరలించడానికి కర్ణాటక సర్కార్ సహకరిస్తోందని చెప్పారు. తారకరత్న కుటుంబ సభ్యులతో చర్చించిన అనంతరం బెంగుళూరుకు తరలించేందుకు నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక నుంచి కుప్పం పీఈఎస్ ఆసుపత్రికి అంబులెన్స్ లు చేరుకున్నాయి. బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తారకరత్నను తరలిస్తున్నారు. బైపాస్ రోడ్డుకి దగ్గర హోసూరు సమీపంలో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తారకరత్న ఆరోగ్యంపై లోకేశ్ ఆరా
కుప్పం పాదయాత్ర పూర్తి చేసుకున్న అనంతరం లోకేశ్ పీఈఎస్ ఆసుపత్రికి వచ్చి తారకరత్న ఆరోగ్య పరిస్థితి వివరాలు వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. తారకరత్న ఆరోగ్యపరిస్థితి సమీక్షించేందుకు బెంగుళూరు నారాయణ హృదయాలయ నుంచి ప్రత్యేక వైద్యులు బృందం కుప్పం వచ్చారు. బెంగుళూరు నుంచి వచ్చిన వైద్యుల బృందంతో లోకేశ్, బాలకృష్ణ చర్చించారు. ఐసీయూలో ఉన్న నందమూరి తారకరత్న ఆరోగ్యంపై నారా లోకేశ్, బాలకృష్ణ, దేవినేని ఉమా, ఎంపీ రామ్ మోహన్ నాయుడు ఆరా తీశారు. తారకరత్న ఆరోగ్యంపై చంద్రబాబు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే తారకరత్న సతీమణి కుప్పం ఆసుపత్రికి చేరుకున్నారు.
గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్
యువగళం పాదయాత్ర సందర్భంగా నందమూరి తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకు యాంజియోగ్రామ్ నిర్వహించారు. తారకరత్న ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు తదితరులు అక్కడే ఉన్నారు. మరోవైపు తారకరత్న ప్రస్తుత పరిస్థితి గురించి బాలకృష్ణ మాట్లాడుతూ... తారకరత్న కోలుకుంటున్నారని చెప్పారు. బీపీ కంట్రోల్ లో ఉందని తెలిపారు. అన్ని పారామీటర్స్ బాగున్నాయని చెప్పారు. అన్ని రిపోర్టులు సక్రమంగా ఉన్నాయని అన్నారు. గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్ అయినట్టు డాక్టర్లు చెప్పారని అన్నారు. కుప్పంలోని డాక్టర్లు మంచి చికిత్స చేశారని ఆయనను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళ్లాలని డాక్టర్లు చెప్పారని... తాము బెంగళూరుకు తరలిస్తున్నామని బాలయ్య చెప్పారు. ఎయిర్ లిఫ్ట్ చేద్దామని అనుకున్నప్పటికీ, వాటిలో సరైన వైద్య పరికరాలు ఉండవని... అందువల్ల రోడ్డు మార్గంలో అంబులెన్సులో తీసుకెళ్లాలని నిర్ణయించామని తెలిపారు. ఆయన తాత ఎన్టీఆర్, నానమ్మ ఆశీర్వాదాలు, భార్య మాంగల్య బలం, అభిమానుల ప్రార్థనల వల్ల ప్రాణాపాయం లేదని చెప్పారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. చంద్రబాబు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారని చెప్పారు.