వేదాద్రి ఎత్తిపోతల ప్రాజెక్టు శంకుస్థాపన చేసి రెండేళ్లు దాటినా పూర్తికాని పనుల వలన స్దానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయానికి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామన్న ప్రభుత్వం దీనిపై ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదని అధికారులు అంటున్నారు.
వేదాద్రి ఎత్తిపోతలు ప్రాజెక్టు మోక్షం ఎప్పుడో
నాటి కృష్ణా జిల్లా నేటి ఎన్టీఆర్ జిల్లాలోని వేదాద్రి ఎత్తిపోతల పథకం పనులు నేటికి పూర్తి కాలేదు. ఆరు నెలల్లో పూర్తి చేస్తామని స్వయంగా సీఎం హామీ ఇచ్చిన ఈ ప్రాజెక్టు.. శంకుస్థాపన చేసి రెండేళ్లు దాటినా.. నేటికీ పనులు కొలిక్కి రాలేదని స్దానికులు అంటున్నారు. 2021 ఫిబ్రవరి కల్లా వేదాద్రి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేస్తానని సీఎం జగన్ చెప్పారు. అయితే ఈ ప్రాజెక్ట్ కు నేటికి అతీగతీ లేకుండాపోయింది. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసే ఉద్దేశంతో గత తెలుగుదేశం ప్రభుత్వం 489 కోట్ల రూపాయల వ్యయంతో ముక్త్యాల ఎత్తిపోతల పథకాన్ని నిర్మించ తలపెట్టింది. 386 క్యూసెక్కుల నీటిని 120 రోజులపాటు ఎత్తిపోతల ద్వారా సాగు భూములకి అందించాలన్నది ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా పులిచింతల ప్రాజెక్టు దిగువన ముక్త్యాల గ్రామం వద్ద పంప్‌హౌస్ నిర్మించాలని నిర్ణయించారు. ఈ ఎత్తిపోతల ద్వారా జగ్గయ్యపేట మండలంతో పాటు చుట్టుపక్కల ఉన్న 38వేల 627 ఎకరాలను సాగులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
జగన్ సర్కార్ హయాంలో మారిన ప్రాజెక్ట్ పేరు...
సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక అత్యంత ప్రతష్టాత్మకంగా తలపెట్టిన రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టుకు మళ్లీ నామకరణం చేశారు. 2019లో ప్రభుత్వం మారాక ప్రాజెక్ట్ పేరును కూడా మార్చారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. రివర్స్ టెండరింగ్ పేరుతో పేరు, స్థలం మార్చి అంతే అంచనా వ్యయంతో వైఎస్‌ఆర్ వేదాద్రి ఎత్తిపోతల పథకంగా నామకరణం చేసింది. 2020 ఆగస్టులో ముఖ్యమంత్రి జగన్ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభించి రెండేళ్లు దాటినా నేటికీ పూర్తికాలేదు.
బిల్లులు పెండింగ్...
పెండింగ్ బిల్లులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్ట్ సంస్థ పనులు మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయిందని స్దానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సాగు భూములకు నీరందిస్తే పంటలు బాగా పండుతాయని ఆశించిన వేదాద్రి ఆయకట్టు రైతులకు నేటికీ నిరాశే మిగిలింది. రైతులను వేదాద్రి ఎత్తిపోతల పథకం వెక్కిరిస్తుందంటూ సోషల్ మీడియాలో పొలిటికల్ వార్ నడుస్తుంది. సుమారు 40 వేల ఎకరాలకు సాగునీటి సమస్య తీర్చాలన్న లక్ష్యంతో ప్రారంభమైన వేదాద్రి ఎత్తిపోతల పథకం నేడు రైతులకు కీలకంగా మారింది. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రభుత్వం సమయం వృథా అయ్యిందని, 30 శాతం పనులు పూర్తి చేసిన గుత్తేదారు సంస్థలు పెండింగ్ నిధులు మంజూరు చేయకపోవడంతో పనులు నిలిపేశాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడున్న ఇసుక, ఇనుము, రాళ్లు వంటి నిర్మాణ సామాగ్రి అంతా వేరే పనుల వద్దకు కాంట్రాక్టర్ తరలించారని రైతులు చెబుతున్నారు. అంతే కాదు కాంట్రాక్ట్ సంస్థకు చెందిన సిబ్బంది కూడా వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం వేదాద్రి ఎత్తిపోతల పథకం నిర్మాణం జరిగే దగ్గర కేవలం భద్రతా సిబ్బంది ఒక్కరే ఉన్నారు. వేదాద్రి ఎత్తిపోతలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులు.. ఇప్పుడు ఉసూరుమంటున్నారని స్థానిక రాజకీయ నేతలు విమర్శిస్తున్నారు. కాల్వలకు దూరంలో ఉన్న తమ పొలాలకు నీరు అందడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.