Krishna News : కృష్ణా జిల్లాలో పొలిటికల్ వాల్ పోస్టర్ల రగడ మొదలైంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిస్తూ రాత్రికి రాత్రి వెలసిన పోస్టర్లపై అధికార పక్షం మండిపడింది. దీంతో వైసీపీ, జనసేన నేతల మధ్య మాటల యుద్ధానికి తెర తీసింది. అధికార పార్టీకి చెందిన నేతలు, జనసేన నేతలపై పోలీసులు ముందే దాడికి పాల్పడటంతో పోలీసులు ఇరువర్గాల పై కేసులు నమోదు చేశారు. దీంతో బహిరంగ ప్రదేశాలలో వాల్ పోస్టర్లకు అనుమతులు తప్పనిసరి జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.


పోస్టర్లపై ఎస్పీ వార్నింగ్ 


బహిరంగ ప్రదేశాలలో వాల్ పోసర్టను ప్రదర్శించాలంటే అనుమతులు తప్పనిసరి అని జిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. వ్యాపార, రాజకీయ, మతపరమైన సమాచారాన్ని గోడ పత్రికల రూపంలో ప్రదర్శించాలంటే, ఆ పత్రికల్లో ముద్రించిన సమాచారం స్థానిక పోలీసు వారికి తెలియజేసి, అందులో పొందుపరిచిన సమాచారం ఎవరి మనోభావాలను దెబ్బతీసేదిగా లేవని నిర్ధారించిన తరువాతే  ప్రదర్శించాలన్నారు. ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా పోస్టర్లు, గోడ పత్రికలు బహిరంగంగా ప్రదర్శిస్తే, తద్వారా ఏవైనా అల్లర్లు చెలరేగితే కారుకులైన వారిపై చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వాల్ పోస్టర్ల ముద్రణ, ప్రదర్శనలో నిర్లక్ష్యం వహించవద్దని, పోలీసువారి అనుమతి తప్పనిసరి అని హెచ్చరించారు.


నేరాలపై ఎస్పీ సమీక్ష 


కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జిల్లా పోలీసు అధికారులతో ఎస్పీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో పెరుగుతున్న పొలిటికల్ గొడవలు నేపథ్యంలో అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహారాలు తెరమీదకు వస్తున్న తరుణంలో కఠిన చర్యలు తీసుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. గొడవలు, అల్లర్లు సృష్టించే గ్రూపులపై నిరంతర నిఘాను ఏర్పాటు చేస్తూ, వారి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని ఎస్పీ అన్నారు. తద్వారా శాంతిభద్రతలను పరిరక్షించుకోగలమని, ప్రధాన కూడళ్లు, జనసంచారం అధికంగా ఉండే ప్రదేశాలలో విజబుల్ పోలీసింగ్ ను పెంచి అసాంఘిక శక్తుల ఆగడాల నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. అంతే కాదు బీట్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ, రాత్రిపూట గస్తీ తిరిగే బీట్ సిబ్బందికి పాయింట్ బుక్స్ అందజేసి ఎవరు ఎన్ని ప్రాంతాలు పరిశీలించింది, ఎంతమంది అపరిచిత వ్యక్తులను విచారించింది, పాయింట్ బుక్ లో నమోదు చేయాలన్నారు. రాత్రి పూట జరిగే నేరాలను, దొంగతనాలను అదుపు చేయాలని, రాజకీయ విభేదాలు అర్ధరాత్రి తెర మీదకు వస్తున్న కారణంగా  అప్రమత్తత అవసరమన్నారు. పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ లో ఉన్న కేసులను సకాలంలో దర్యాఫ్తు పూర్తి చేసి చార్జిషీట్  ఫైల్ చేయాలన్నారు.


మంత్రి జోగి రమేష్ ఇలాఖాలో 


మంత్రి జోగి రమేష్ ప్రాతినిధ్యం వహస్తున్న పెడన నియోజకవర్గంలో సీఎం కటౌట్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో పాటు జోగి రమేష్ కు వ్యతిరేకంగా  ప్రభుత్వం అవినీతి పేరుతో రాత్రికి రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లను అంటించారు. అయితే ఇవన్నీ జనసేనకు చెందిన నాయకులే చేశారని వైసీపీ భావిస్తోంది. దీంతో జనసేన నేతలను పోలీసులు అరెస్ట్ చేయటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు స్పందించి ఇరు వర్గాల పై కేసులు నమోదు చేశారు.