Gudivada Tension : కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది. గుడివాడ శరత్ థియేటర్ వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పర ఘర్షణకు దిగాయి. దీంతో ఇరువర్గాలను పోలీసులు అదుపుచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో కారణంగా గుడివాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ-వైసీపీ వర్గీయుల పరస్పరం దాడులకు పాల్పడుతున్నారు. గుడివాడ శరత్ టాకీస్ వద్ద వైసీపీ జెండాలతో పలువురు కార్యకర్తల హల్ చల్ చేశారు. తెలుగుదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వెళ్తున్న మాజీ ఎంపీ మాగంటి బాబు కారును కొందరు అడ్డుకునేయత్నం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.
టీడీపీ, వైసీపీ శ్రేణుల ఘర్షణ
కృష్ణా జిల్లా గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కార్యాలయం వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఇరు పార్టీలు కార్యకర్తలు ఎవరూ కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. టీడీపీ, వైసీపీ శ్రేణులు ఎదురుపడకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఎన్‌ఎస్‌జీ బలగాలను కూడా రంగంలోకి దించినట్లు పోలీసులు తెలిపారు.
చంద్రబాబు రోడ్ షో
కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు.. గుడివాడ నియోజకవర్గంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. రామనపూడి వద్ద గుడివాడ నియోజకవర్గంలోకి చంద్రబాబు రోడ్ షో ఎంటర్ అవ్వగానే... టీడీపీ నేతలు రావి వెంకటేశ్వరరావు, వెనిగండ్ల రాము, పిన్నమనేని వెంకటేశ్వరరావు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు రోడ్ షోకు పెద్ద సంఖ్యలో జనం, టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. టీడీపీ శ్రేణులు ర్యాలీగా చంద్రబాబు రోడ్‌షోను అనుసరించారు. . అంతకు ముందు బసవతారకం పుట్టినూరు కొమురవెల్లిలో ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు చంద్రబాబు నివాళి అర్పించారు. అనంతరం నిమ్మకూరు నుంచి భారీ ర్యాలీగా గుడివాడ బయలుదేరారు. గుడివాడలో కోతి బొమ్మసెంటర్, బస్ స్టాండ్ సెంటర్ మీదుగా చంద్రబాబు రోడ్ షో మొదలైంది. టీడీపీ అధినేతకు పార్టీ శ్రేణులు భారీ గజమాలతో స్వాగతం పలికాయి.