కొత్తపేట: మే 13న ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే వర్షాలతో పలు జిల్లాల్లో పోలింగ్ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. పోలింగ్ సామగ్రి తీసుకెళ్లేందుకు అవస్థలు పడ్డారు. డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో పోలింగ్ సిబ్బందికి సామగ్రిని అందజేశారు. కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ సిబ్బంది కొత్తపేట హైస్కూల్ గ్రౌండ్ వద్ద ఈవీఎం తదితర పరికరాలను అధికారులు అందజేశారు.
ఆదివారం నాడు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు సిబ్బంది ఉండటానికి వేసిన టెంట్లు కూలిపోయాయి. అలాగే తమకు ఇచ్చిన సామగ్రిని తీసుకు వెళ్లేందుకు పోలింగ్ సిబ్బంది నానా ఇబ్బందులు పడ్డారు. వర్షం దాటికి మోకాళ్ళ లోతు నీరు బురద గ్రౌండ్ లోకి చేరడంతో ఇచ్చిన సామగ్రితో బయటపడడానికి అవస్థలు పడ్డారు. గ్రౌండ్ లో సిబ్బంది ఎక్కిన బస్సులు ముందుకు కదలక మొరాయించాయి. దీంతో జేసీబీల సహాయంతో వాటిని ముందుకు కదిలించారు. మరోవైపు భోజన సదుపాయాలు కూడా అంతంత మాత్రం గానే ఉన్నాయని పలువురు సిబ్బంది వాపోయారు. వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందుగానే వెల్లడించినా తగిన చర్యలు తీసుకోవడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి.
పులివెందులలో గాలివాన బీభత్సం
కడప జిల్లా పులివెందులలో ఎన్నికల వేళ గాలి వాన బీభత్సం సృష్టించింది. EVM పంపిణీ కేంద్రం లో గాలి వానతో పోలింగ్ సిబ్బంది ఇబ్బందిపడ్డారు. పులివెందులలో ఈదురు గాలుల ప్రభావంతో ఎన్నికల కోసం జేఎన్టీయూ లో ఏర్పాటు చేసిన తాత్కాలిక టెంట్లు కూలిపోయాయి. కుర్చీలు కింద పడ్డాయి. వర్షం పడుతున్న సమయంలో ఎన్నికల సిబ్బంది వారి సంబంధించిన కిట్లతో బస్సులు ఎక్కారు.
తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డితో పాటు పలు జిల్లాల పరిధిలో గాలి వాన, పిడుగులు పడి సంభవించిన నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. వర్ష సూచనలు ఉన్నందున జిల్లాల్లో కలెక్టర్లు, రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తగిన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.
మెదక్ జిల్లాలో పెద్ద శంకరంపేట మండలంలో పిడుగు పడి ఇద్దరు మృతి చెందిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన ఇద్దరి కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలంలోని గిమ్మ గ్రామంలో పిడుగుపాటుకు ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారికి వైద్య సాయం అందేలా చూడాలని అక్కడి అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచిపోతే, రైతులు ఆందోళన చెందవద్దని.. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులకు ఆయన సూచించారు.
వరంగల్ నగరం లో ఈదురు గాలులతో వర్షం బీభత్సం సృష్టించింది. రెండు గంటలపాటు ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. ఈదురు గాలులతో విద్యుత్ సరఫరాకు పలు చోట్ల అంతరాయం కలిగింది. దీంతో నగరవాసులు ఇబ్బంది గురవుతున్నారు. గాలివాన బీభత్సంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కొన్ని ప్రాంతాల్లో నగర రోడ్లు జలమయమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఈదురు గాలులతో వర్షం కురిసింది.