Graffiti Slogans on Metro Walls: ఢిల్లీ మెట్రో స్టేషన్ గోడలపై ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కొందరు దుండగులు అభ్యంతరకర రాతలు రాశారు. ఖలిస్థాన్‌కి మద్దతుగా గ్రాఫిటీతో నినాదాలు రాశారు. కరోల్‌బాగ్, ఝండేవాలా మెట్రో స్టేషన్‌ల వద్ద ఇవి కనిపించడం కలకలం సృష్టించింది. వెంటనే అధికారులు అప్రమత్తమై వాటిని చెరిపేశారు. ఢిల్లీ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ రెండు మెట్రో స్టేషన్‌ల వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఫుటేజ్ ఆధారంగా ఎవరు ఈ పని చేశారో గుర్తిస్తామని వెల్లడించారు.
గతంలోనూ నిహార్ విహార్ ప్రాంతంలో ఇదే విధంగా ఓ గవర్నమెంట్ స్కూల్‌పై గోడలపై ఇలాగే గ్రాఫిటీతో ఖలిస్థాన్ నినాదాలు రాయడం కలకలం రేపింది. "జనవరి 26 ఖలిస్థాన్" అని రాశారు. ఎవరూ పెద్దగా గమనించని ప్రాంతాల్లో,సీసీ కెమెరాలు లేని చోట ఇలాంటి రాస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. అప్పట్లో ఖలిస్థాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ భారత్‌పై దాడి చేస్తామంటూ బెదిరించారు. సరిగ్గా ఆ సమయంలోనే గోడలపై ఈ రాతలు కనిపించడం అలజడి సృష్టించింది. ఇప్పుడు మరోసారి ఢిల్లీ మెట్రో గోడలపై ఇలాంటి రాతలే కనిపించడంపై పోలీసులు అప్రమత్తమయ్యారు.