Prattipadu Tiger Roaming : కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారం స్థానికులను భయపెడుతోంది. మే 26 నుంచి ప్రత్తిపాడు మండలంలో పులి కదలికలను స్థానికులు గుర్తించారు. పోతులూరులో ఓ పశువుని పులి చంపింది. దీంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమై బోన్ లు ఏర్పాటు చేశారు. ఫారెస్ట్ అధికారులు అమర్చిన కెమెరాల్లో పులి సంచరిస్తున్న ఫొటోలు పడ్డాయి. గురువారం పాండవుల పాలెంలో పెద్దపులి ఆవును చంపేసింది. రానున్న రెండుమూడు రోజుల పాటు పోతులూరు, పాండవులపాలెం, వొమ్మంగి, శరభవరం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల సాయంత్రం 5 నుంచి ఉదయం 7 వరకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని పోలీసులు ప్రకటన చేశారు. పశువుల్ని పొలాల్లో కాకుండా ఇళ్ల వద్ద కట్టేయాలని సూచించారు.
ఉదయం 7 వరకు బయటకు రావొద్దు
అటవీ జంతువులు జనసంచారంలోకి వచ్చినప్పుడు కొన్ని పద్ధతుల ప్రకారం వాటిని అదుపుచేయాలి. ఇందుకు ప్రజల సహకారం చాలా ముఖ్యం. పోలీసులు, అటవీ శాఖ అధికారులు చెప్పినట్లు సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 7 వరకు బయటకు రావొద్దని తెలిపారు. సాయంత్రం 5 లోపు ప్రజలు పనులు ముగించుకోవాలి. పులికి ఎటువంటి అభ్యంతరం లేకుండా ఉంటే దాని ట్రాక్ అది తీసుకుని వెళ్లిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రాన్క్వీలైజ్ చేయాలన్నా కష్టం. - - ప్రసాద్, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అధికారి
పోతులూరి గ్రామ పరిధిలో
గత నెల 27న పోతులూరి గ్రామం సమీపంలో పెద్ద పులి సంచారం గుర్తించాం. అక్కడ కెమెరాలు పెట్టి పులి మూవ్మెంట్ పరిశీలించాం. పోలవరం కెనాల్ వద్ద నీళ్లు తాగడానికి వచ్చింది. కొన్ని రోజులు దాని అలజడి కనిపించలేదు. పాండవపాలెం వద్ద పులి అడుగులు కనిపించాయి. రిజర్వ్ ఫారెస్ట్ సైడ్ వెళ్లిపోతుంది అనుకున్నాం. కానీ పులికి ఆహారం దొరకకపోవడం, గ్రామస్థులు జంతువులను ఇళ్ల వద్దే ఉంచడంతో మళ్లీ ఓ 6 కిలోమీటర్లు వెనక్కి వచ్చింది. నిన్న నైట్ స్థానికంగా ఉన్న పశువులపై దాడి చేసింది. ఒక దాన్ని టార్గెట్ చేసింది ఆ దాడిలో ఒక పశువు చనిపోయింది. ఒకటి రెండు రోజులు ఇక్కడే ఉండే అవకాశం ఉంది. - - ఫణీంద్ర, వెటర్నరీ డాక్టర్
ప్రజలు సహకరించాలి
పోతులూరు గ్రామంలో గత నెల 27 నుంచి పెద్దపులి సంచారం జరిగింది. అయితే పులి దాని మార్గంలో మళ్లీ అడవిలోకి వెళ్లిపోయేందుకు అటవీ శాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎస్పీ రవీంద్రబాబు ఆదేశాలతో ఫారెస్ట్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నాం. ప్రజలను కోరితే ఒక్కటే క్యూరియాసిటీతో ఇక్కడ వచ్చేందుకు ప్రయత్నించవద్దు. పోలీసులు, అటవీ అధికారుల సూచనలు పాటిస్తే మళ్లీ పులి అటవీలోకి వెళ్లిపోతుంది. ప్రజలు బారికేడ్లు దాటకుండా ఉండి సహకరించాలి. పులి అడుగులను బట్టి ఇక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. ఒమ్మంగి, పాండవుపాలెం, పొదలపాక, చుట్టుపక్కల గ్రామల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సాయంత్రం 6 గంటల నుంచి బయటకు రాకుండా ఉండాలి. పశువులను కూడా ఇంటి దగ్గర ఉంచుకోండి. పోలీసులు పెట్టిన బారికేడ్లు దాటకూడదని ప్రజలను కోరుతున్నాం. - -కిషోర్ బాబు, ప్రత్తిపాడు సీఐ