Chaliye Hukum: ఎప్పుడూ చాలా సీరియస్‌గా కనిపించే కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. అప్పుడప్పుడు చాలా సరదాగా మాట్లాడతారు. రాజకీయ నేతలకు ఫ్యామిలీతో గడిపే సమయం చాలా తక్కువ. కీలక పదవుల్లో ఉన్నవారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భాజపాను అన్నీ తానై నడిపిస్తోన్న అమిత్ షాకు తీరిక దొరకడం గగనమే. అయితే బిజీ షెడ్యుల్లో అమిత్ షా ఫ్యామిలీతో కలిసి ఇటీవల ఓ సినిమా చూశారు.
13 ఏళ్ల తర్వాత
బుధవారం సాయంత్రం దిల్లీలోని చాణక్య ఫిల్మ్ హాల్‌లో అక్షయ్ కుమార్ నటించిన 'సామ్రాట్ పృథ్వీరాజ్' సినిమా స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది. దీనికి అమిత్ షా తన కుటుంబంతో పాటు హాజరయ్యారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత కుటుంబంతో అదీ థియేటర్‌లో ఓ సినిమా చూసినట్లు అమిత్ షా తెలిపారు.
అయితే సినిమా చూసి చివర్లో థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అమిత్ షా వేసిన జోకు అక్కడ నవ్వులు పూయించింది.
చలియే హుకుం
సినిమా చూసిన తర్వాత సామ్రాట్ పృథ్వీరాజ్ యూనిట్‌పై అమిత్ షా ప్రశంసలు గుప్పించారు. భారతీయ సంప్రదాయాన్ని, ముఖ్యంగా మహిళా సాధికారికత గురించి సినిమాలో అద్భుతంగా చూపించారంటూ మెచ్చుకున్నారు. జూన్ 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
చివర్లో తన ప్రసంగం ముగిసిన వెంటనే అమిత్ షా బయటకు వెళ్తుండగా.. ఆయన భార్య సోనాల్ మాత్రం కాస్త గందరగోళానికి గురై అక్కడే అటు ఇటు చూస్తూ ఉండిపోయారు.
దీంతో 'చలియే హుకుం' అని గంభీరమైన స్వరంతో అమిత్ షా అన్నారు. ఆ మాటకు ఆమె సిగ్గుతో తలదించుకోగా.. అక్కడున్న వాళ్లంతా నవ్వారు. ఆ తర్వాత షా తనయుడు జై షా తన తల్లిని దగ్గరుండి తండ్రి దగ్గరకు తీసుకెళ్లాడు. చలియే హుకుం అనేది ఆ సినిమాలో ఓ డైలాగ్.
Also Read: J&K: బ్యాంక్ మేనేజర్‌ను కాల్చి చంపిన ఉగ్రవాదులు- కశ్మీరీ పండిట్ల సంచలన నిర్ణయం
Also Read: Sonia Gandhi Corona Positive: ఈడీ విచారణ వేళ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా పాజిటివ్