Amaravati Padayatra : అమరావతి రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. కోనసీమ జిల్లా పసలపూడిలో రైతుల పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం 600 మందిని మాత్రమే పాదయాత్రకు అనుమతిస్తామని తెలిపారు. ఐడీ కార్డులు చూపించి ముందుకు సాగాలని పోలీసులు సూచించారు. ఈ క్రమంలో పోలీసులు, అమరావతి రైతులకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో మహిళా రైతులు కొందరు కిందపడిపోయారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు అరసవల్లి వరకు పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. రైతుల పాదయాత్రను అడ్డుకుంటామని ఉత్తరాంధ్ర మంత్రులు, వైసీపీ నేతలు అంటున్నారు. వైసీపీ నేతలు ఎక్కడికక్కడ నల్ల బెలూన్లు చూపిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

  






రోడ్డుపై బైఠాయించిన రైతులు 


శుక్రవారం ఉదయం రాయవరంలో మొదలైన రైతుల పాదయాత్ర మధ్యాహ్నం భోజన విరామ సమయానికి కోనసీమ జిల్లా పసలపూడి వద్దకు చేరుకుంది.  భోజన విరామం తర్వాత రైతులు యాత్ర ప్రారంభించగానే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఐడీ కార్డులు చూపించాలని రామచంద్రాపురం డీఎస్పీ ఎం.బాలచంద్రారెడ్డి, అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి రైతులను కోరడంతో పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చాలా రోజులుగా యాత్ర చేస్తున్న తమను అడ్డుకోవడం ఏంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తున్నారని రైతులను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. రైతులు నినాదాలు చేస్తూ ముందు కదిలే ప్రయత్నం చేయడంతో తోపులాట జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ రైతులు రోడ్డుపైనే బైఠాయించి నినాదాలు చేశారు. రైతులు ఐడీ కార్డులు చూపించిన తర్వాతే ముందుకు సాగాలని పోలీసులు స్పష్టం చేశారు. 


600 మందికి మాత్రమే అనుమతి 


అమరావతి రైతుల పాదయాత్రలో పెద్ద ఎత్తున మద్దతుదారులు పాల్గొనవద్దని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. మద్దతుదారులు రోడ్డుకు ఇరవైపులా నిలబడి మద్దతు తెలియచేయవచ్చునని.. కానీ పాదయాత్రలో పాల్గొనవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పాదయాత్రలో 600 మంది మాత్రమే పాల్గొనాలని మద్దతు ఇచ్చేవాళ్లు పాదయాత్రలో కలిసి నడవకుండా చూసే బాధ్యత పోలీస్ అధికారులదేనని తెలిపింది. పాదయాత్రలో కేవలం నాలుగు వాహనాలు మాత్రమే వాడాలని హైకోర్టు స్పష్టం చేసింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకునే హక్కు పోలీసులకు ఉందని కూడా హైకోర్టు తెలిపింది. నిబంధనలకు లోబడే పాదయాత్ర జరగాలని హైకోర్టు తేల్చిచెప్పింది. హైకోర్టు విధించిన నిబంధనను పాటించడంలో విఫలమైతే మాత్రం అమరావతి పాదయాత్ర నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది. పాదయాత్ర సందర్భంగా వైసీపీ అడ్డంకులు కల్పిస్తోందని, పోలీసులు ఆంక్షలు విధిస్తున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. పాదయాత్రను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం రద్దు హైకోర్టులో పిటిషన్ వేసింది.