Konaseema News : పేదింట వృద్ధులకు సంక్షేమ పథకాలను అందివ్వడంతోపాటు అంతేస్థాయిలో పారదర్శకంగా అమలు అయ్యేలా చూస్తున్నామని చెబుతున్న అధికారులు వాలంటీర్లు క్షేత్ర స్థాయిలో చేస్తున్న నిర్వాకాలు చూసి విస్తుపోయేలా ఉంటున్నాయని చర్చించుకుంటున్నారు. వైసీపీ నాయకుని మాటతో  ఓ వాలంటీర్ అతి ప్రదర్శించి ఆరుబయట పడుకోబెట్టిన మృతదేహానికి వేలిముద్ర వేయించి మరీ పింఛను డ్రా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా ఓ వైకాపా నాయకుని సూచనల మేరకే చేసినట్లు వాలంటీర్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అల్లవరం మండలం కొమరగిరిపట్నం గ్రామంలో ఆలస్యంగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి కొమరగిరిపట్నం అనే గ్రామంలోని సచివాలయం 3 పరిధిలోని ఓ వీధిలో అందరూ చూస్తుండగానే ఓ వాలంటీర్ మృతదేహానికి బయోమెట్రిక్ తీసుకున్నట్లు చెబుతున్నారు. 


వైసీపీ నేత ఆదేశాలతో 


గ్రామంలోని మూడో సచివాలయ పరిధిలోని ఓ వీధిలో గతనెల 28వ తేదీ రాత్రి ఓ వృద్ధురాలు మృతిచెందింది. మృతదేహాన్ని ఆరుబయట ఉంచారు. అయితే మార్చి ఒకటో తేదీ కావడంతో ఉదయం పింఛన్ పంపిణీ చేపట్టిన ఆ ప్రాంత వాలంటీరుకు స్థానికంగా ఉన్న ఓ వైసీపీ నాయకుడు మృతదేహం వేలిముద్ర తీసుకుని పింఛను ఇవ్వాలని ఆదేశించాడు.  బయోమెట్రిక్‌ తెచ్చి అందరూ చూస్తుండగానే మృతదేహం వేలిముద్ర ద్వారా బయోమెట్రిక్‌ వేసి పింఛను పంపిణీ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈ విషయం బయటకు పొక్కడంతో అదే నాయకుడు కలుగజేసుకుని మరీ ఇది సద్దుమణిగేలా చేశాడట. వాలంటీరు నిర్వాకంపై సర్వత్రా విశ్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు సదరు గ్రామ వెల్ఫేర్ అసిస్టెంట్, వాలంటీరును వివరణ కోరారు. దీనిపై విచారణ చేస్తున్నామని, మృతదేహానికి బయో మెట్రిక్ చేసినట్లు నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ జి. సరోవర్ వెల్లడించారు.


విజయనగరంలో కూడా 


ఏపీలో చనిపోయిన వృద్ధురాలికి గ్రామ వాలంటీర్ పింఛన్ పంపిణీ చేసిన వ్యవహారం ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. విజయనగరం జిల్లా గుర్ల మండలంలోని గుర్ల గ్రామంలో ఎర్ర నారాయణమ్మ అనే వృద్ధురాలు ఫిబ్రవరి నెలాఖరులో మరణించారు. ప్రతి నెలా 1వ తేదీన వాలంటీర్లు ఇంటి వద్దే వృద్ధులకు పింఛన్ అందజేస్తారు. ఒకటో తేదీ కావడంతో వాలంటీర్‌గా పని చేస్తున్న త్రినాథ్ పింఛను పంపిణీ చేసేందుకు వృద్ధురాలు ఎర్ర నారాయణ ఇంటికి వెళ్లారు. అప్పటికే ఆమె మరణించగా మృతదేహాన్ని ఇంటి బయట ఉంచారు కుటుంబ సభ్యులు.  అదే సమయంలో అక్కడికి చేరుకున్న త్రినాథ్... ఎర్ర నారాయణ చనిపోయినప్పటికీ అప్పటికీ ఆమె పేరులో పింఛను వచ్చింది కాబట్టి ఇవ్వడం తన విధి అంటూ ఆమెతో వేలి ముద్ర వేయిస్తే చాలని కుటుంబ సభ్యలతో చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె వేలిని బయోమోట్రిక్ పరికరంపై ఉంచి వేలిముద్రలు వేయించి పింఛన్ ఇచ్చాడు. పింఛన్ ఇచ్చిన సమయంలో ఫొటోలు తీయడంతో చనిపోయిన వృద్ధురాలికి పింఛను ఇస్తున్నట్లు ఫొటోలు సోషల్ మీడయాలో వైరల్‌ అయ్యాయి. చనిపోయిన వారికి పింఛన్, ఇతర పథకాలు ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించవని అధికారులు అంటున్నారు. చనిపోయిన వ్యక్తికి పింఛన్ పంపిణీ చేశారనే విషయం తెలుసుకున్న అధికారులు సమాచారం సేకరించి దర్యాప్తు చేపట్టారు.