Ysrcp Mlc Candidates : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొమ్మి ఇజ్రాయేల్, స్థానిక సంస్థల నుంచి కుడుపూడి సూర్యనారాయణ రావు పేరు ఖరారు చేసింది. వైసీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, మాదిగ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ బొమ్మి ఇజ్రాయేల్‌కు శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా పోటీచేయనున్నారు. గ్రామ ఉపసర్పంచ్ నుంచి శాసన మండలి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొమ్మి ఇజ్రాయేల్ ఎదిగారు. తాడేపల్లిలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. మాదిగ దండోరా ఉద్యమ సమయం నుంచి యాక్టివ్‌గా రాజకీయాల్లో ఉన్న ఇజ్రాయేల్..అంబేడ్కర్ ఆర్గనైజేషన్లలోనూ పనిచేశారు. ఇజ్రాయేల్ స్వస్థలం అమలాపురం నియోజకవర్గంలోని అల్లవరం మండలం గోడి గ్రామం. గతంలో గోడి గ్రామ ఉపసర్పంచ్‌గా పనిచేసిన ఇజ్రాయేల్.. వైసీపీ పార్టీలో పలు పదవుల్లో పనిచేశారు. స్థానికంగా మంత్రి విశ్వరూప్‌కు ముఖ్య అనుచరునిగా ఆయన ఉన్నారు. 1995లో ఎస్కేబీఆర్ కళాశాలలో ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్‌కు అధ్యక్షునిగా పనిచేశారు ఇజ్రాయేల్.
వారిద్దరి కృషి ఉందన్న ఇజ్రాయేల్
బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌కు అత్యంత సన్నిహితుడు ఇజ్రాయేల్. తనకు ఎమ్మెల్సీ పదవి రావడం వెనుక మంత్రి విశ్వరూప్, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కృషి ఉందని ఇజ్రాయేల్ తెలిపారు. అన్నివర్గాలకు న్యాయం చేయగల ఏకైన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాత్రమే అన్నారు. సామాన్య కార్యకర్తనైన తనకు ఎమ్మెల్సీ ఇవ్వడం ఒక్క వైసీపీ పార్టీకు, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికే సాధ్యమన్నారు.
స్థానిక సంస్థల కోటాలో కూడిపూడికి సీటు
కూడుపూడి సూర్యనారాయణను స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది. ఆయన స్వస్థలం అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సూర్యనగర్. ఉభయ రాష్ట్రాల శెట్టిబలిజ మహానాడు కన్వీనర్‌గా సూర్యనారాయణరావు పనిచేశారు. రాష్ట్ర గిడ్డంగుల శాఖ ఛైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. తెలుగుదేశం పార్టీ తరపున రామచంద్రపురం నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయారు. సూర్యనారాయణరావు తండ్రి మాజీ డీజీపీ కుడిపూడి గోపాలకృష్ణగోఖలే. విద్యార్థి దశ నుంచి శెట్టిబలిజ సామాజిక వర్గం తరపున పలు ఉద్యమాల్లో పనిచేశారు సూర్యనారాయణరావు.
బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట-సజ్జల
ఎమ్మెల్సీ స్థానాల్లో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశామని వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. 18 ఎమ్మెల్సీ స్థానాలకు గానూ స్థానిక కోటాలో 9 మంది, ఎమ్మెల్యే కోటాలో ఏడుగురు, గవర్నర్ కోటాలో మరో ఇద్దరి పేర్లను ప్రకటించారు. ఇందులో బీసీలకు 11, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1, ఓసీలకు 4 స్థానాలకు కేటాయించారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్థానం కల్పించారని చెప్పారు.
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేశామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్‌బోన్ క్లాస్ అని జగన్మోహన్ రెడ్డి నిరూపించారని కొనియాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చామన్నారు సజ్దల. ఓట్ల కోసం నినాదాలు ఇచ్చే పార్టీ తమది కాదని...వారిని అధికారంలో భాగస్వామ్యులను చేశామని చెప్పారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనది అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్ చేశారు. టీడీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మండలిలో 37 శాతం ప్రాతినిధ్యం కల్పిస్తే.. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రం బీసీలకే 43 శాతం ఎమ్మెల్సీ పదవులు ఇచ్చామన సజ్జల స్పష్టం చేశారు. మండలిలో బీస్సీ, ఎస్సీ, ఎస్టీలకు 68 శాతం ఎమ్మెల్సీ పదవులు ఇచ్చామన్నారు. సామజిక సాధికారిత అంటే తమదేనన్నారు. చంద్రబాబు మాటలు చెబితే మేము చేతల్లో చూపించాము అని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.