Srirama Navami 2022 : పూర్వం రాముల వారి కల్యాణ ఘట్టం సమయంలో క్షత్రియ సామజిక వర్గం వారు రాముల వారి తరపున సీతమ్మ తల్లికి సారెను అందించేవారు. దానినే కంత సారె అని పిలిచేవారు. అదే ఆచారం కోనసీమ జిల్లా పి.గన్నవరంలో నేటికి కొనసాగుతోంది. కోనసీమ జిల్లా పి.గన్నవరం గ్రామంలోని గోదావరి గట్టున వున్న సీతారాముల వారి ఆలయంలో ప్రతి ఏటా శ్రీరామనవమి కల్యాణం రోజున విశిష్ట ఆచారాన్ని అనాధిగా పాటిస్తున్నారు. గోదావరి గట్టున వేంచేసి ఉన్న ఈ రామాలయానికి పేరిచర్ల సత్యవాణి, భీమరాజు దంపతులు గత కొన్ని సంవత్సరాలుగా కంత సారెను తయారు చేసి  సమర్పిస్తున్నారు. ఇందులో వివిధరకాల పిండి వంటలు, పాలకోవతో వివిధ రకాల ఫలాల ఆకృతులు, చీరను తయారు చేసి కంత సారెగా శ్రీరామనవమికి రాములవారి తరపున సీతమ్మకు అందిస్తారు. ఇది త్రేతాయుగంలో రాములవారి కల్యాణ సమయంలో క్షత్రియ సామాజికవర్గం వారు సీతమ్మ తల్లికి కంత సారె ఇచ్చేవారని పురాణాలు చెబుతున్నాయి. పూర్వకాలం నుంచి అనాధిగా వస్తున్న సంప్రదాయాన్ని పాటిస్తున్న ఈ గ్రామంలో జరిగే కల్యాణ ఘట్టాన్ని తిలికించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. 



బియ్యపు గింజలపై రామాయణం 


బియ్యం గింజ‌ల‌పై రామాయణం రాసి అబ్బుర‌ప‌రుస్తోంది విజ‌య‌వాడ గొల్లపాలెం గ‌ట్టుకు చెందిన కారుమూరి మౌళ్య ప‌ద్మావ‌తి శ్రీ‌వ‌ల్లి. చిన్నత‌నం నుంచి చిత్రలేఖ‌నంపై మ‌క్కువ‌తో అనేక పోటీల్లో పాల్గొని బ‌హుమ‌తులెన్నో సాధించింది. ప‌దేళ్ల వ‌య‌స్సు నుంచే బియ్యం గింజ‌ల‌పై అక్షరాలు రాయ‌డం నేర్చుకొని అనేక ప్రాజెక్టులు రూపొందించింది. రామాయ‌ణంలోని ముఖ్యాంశాల‌తో ఓ చిత్రప‌టాన్ని రూపొందించి వ‌ర‌ల్డ్ బుక్ రికార్డుల్లోకి సైతం స్థానం ద‌క్కించుకోబోతోంది.  స్వాతంత్య్ర స‌మ‌ర‌యోథుడి జీవిత చ‌రిత్రను బియ్యపు గింజ‌ల‌పై లిఖించడ‌మే త‌న జీవిత ల‌క్ష్యమంటుంది ప‌ద్మావ‌తి. 


అయోధ్య రామమందిరంలో ప్రదర్శించడమే లక్ష్యం 


విజయవాడ గొల్లపాలెం గ‌ట్టుకు చెందిన తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న కారుమూరి మౌళ్య ప‌ద్మావ‌తి శ్రీ‌వ‌ల్లి బియ్యం గింజ‌ల‌పై  అక్షరాల‌ను అల‌వోక‌గా రాస్తూ అంద‌రినీ అబ్బుర‌ప‌రుస్తోంది. చిన్నత‌నం నుంచే చిత్రలేఖ‌నం అంటే ఆమెకు ప్రాణం. ఆయిల్ పెయింటింగ్‌, వాట‌ర్ పెయింటింగ్‌, పాట్ పెయింటింగ్ ఇలా అనేక ప్రక్రియ‌ల్లో అంద‌మైన చిత్రాలెన్నింటినో మ‌న‌సుకు హ‌త్తుకునేలా చిత్రించి ప‌లువురి ప్రశంస‌లందుకుంది. పాఠ‌శాల‌లో నిర్వహించిన అనేక పోటీల్లోనూ బ‌హుమ‌తులెన్నింటినో ద‌క్కించుకుంది. అంద‌రిలా కాగితంపై చిత్రాలు గీయడం కంటే బియ్యం గింజ‌ల‌పై అక్షరాలు రాస్తే ఎలా ఉంటుంద‌నే ఆలోచ‌న వ‌చ్చింది. అంతే ఒక‌చోట మైక్రో ఆర్టిస్ట్ బియ్యం గింజ‌ల‌పై అక్షరాలు రాయ‌డం చూసి ఆ  విద్యను నేర్చుకుంది. త‌న‌లోని ప్రతిభ‌కు మ‌రింత ప‌దును పెట్టి ఒక్క గింజ‌పై 8 అక్షరాల వ‌ర‌కూ రాసి ఔరా అనిపించింది. శ్రీ‌రాముడిపై ఉన్న భ‌క్తితో రామాయ‌ణాన్ని ప్రజ‌లంద‌రికీ చేరువ చేయాల‌నే స‌త్సంక‌ల్పంతో 15 రోజులు శ్రమించి రామాయ‌ణంలో ఏడు కాండల్లోని సారాన్ని క్లుప్తంగా బియ్యం గింజ‌ల‌పై రాసింది. వీటిన‌న్నింటిని రాముడి చిత్రప‌టం చుట్టూ అమ‌ర్చింది. రాముల‌వారి ప‌టం చుట్టూ జాతీయ‌ భాష‌ల‌న్నింటిలోనూ బియ్యపు గింజ‌ల‌పై శ్రీ‌రామ అని రాసి అమ‌ర్చింది. ఈ ప్రాజెక్టును దాత‌లు ఎవ‌రైనా స‌హ‌క‌రిస్తే అయోధ్య రామ‌మందిరంలో ప్రద‌ర్శించ‌డ‌మే ల‌క్ష్యమ‌న్నారు.