Somu Veerraju On Jr NTR : ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు. వీరి మధ్య రాజకీయ చర్చ జరిగి ఉంటుందని బీజేపీ నేతలు అంటున్నారు. జూ.ఎన్టీఆర్ అమిత్ షా భేటీ పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు జూ.ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోము వీర్రాజు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ జూ. ఎన్టీఆర్‌ సేవలను ఉపయోగించుకుంటామన్నారు. టీడీపీపై తమ వైఖరిలో ఎలాంటి మార్పులేదన్నారు. జూ.ఎన్టీఆర్‌కు ప్రజాదరణ ఎక్కువ అని, ఆయన సేవలు ఉపయోగించుకుంటామన్నారు. ఫ్యామిలీ పార్టీలకు దూరమని బీజేపీ అధిష్ఠానం చెప్పిందని వ్యాఖ్యలు చేశారు. 


కాకినాడలో బల్క్ డ్రగ్ పార్క్ 


అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు శనివారం పర్యటించారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ చేస్తున్న అవినీతి, ప్రధాని మోదీ అందిస్తున్న పథకాలు, సేవలను ప్రజలకు తెలియజేయడం కోసం  రాష్ట్రవ్యాప్తంగా 5 వేల బహిరంగ సభలు ఏర్పాటు చేయడానికి సంకల్పించామన్నారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సెప్టెంబర్ 17 నుంచి గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీ వరకూ 5 వేల సభలను నిర్వహిస్తామన్నారు. రావులపాలెం కొత్తపేట అమలాపురాన్ని అనుసంధానిస్తూ  మరొక నేషనల్ హైవేను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని సోము వీర్రాజు తెలిపారు. కాకినాడ జిల్లాకు బల్క్ డ్రగ్ ఇండస్ట్రీని తీసుకొచ్చామన్నారు. కేంద్రం నుంచి వెయ్యి కోట్ల సహాయాన్ని అందిస్తామన్నారు. తీర ప్రాంత మండలాల్లో పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటుచేస్తామన్నారు. 


కోనసీమ జిల్లాలో 280 సభలు 


"కోస్టల్ కారిడార్ అభివృద్ధి చెందడానికి 4 లైన్ల 216 రోడ్ ను అనుసంధానిస్తాం. రాష్ట్రాన్ని పారిశ్రామిక వాడలుగా మార్చటం కేంద్ర ప్రభుత్వ ఆలోచన. కేంద్ర ప్రభుత్వం బియ్యం కోసం కేజీకి 38 రూపాయలు ఇస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ నాసిరకం బియ్యాన్ని ప్రజలకు అంటగడుతోంది. నాసిరకం బియ్యాన్ని ప్రజల నుంచి కొనుగోలు చేసి వాటిని రీ మిల్లింగ్ చేసి కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రం తన పథకాలుగా చెప్పుకుంటోంది. ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న అవినీతిని ప్రజలకు తెలియజేయడం కోసం కోనసీమ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 40 బహిరంగ సభలు, జిల్లాలో 280 బహిరంగ సభలు ఏర్పాటుచేస్తాం. బహిరంగ సభల కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇన్ ఛార్జ్ లను ఏర్పాటు చేశాం." - సోము వీర్రాజు 


చంద్రబాబు అడ్డుపడడం సరికాదు


రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని మోదీ కాకినాడ జిల్లాకు బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ కేటాయిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుపడటం సరికాదని సోము వీర్రాజు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాలు కోరినా ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌కు బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ కేటాయించారన్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు అడ్డుపడుతూ బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ వద్దంటూ లేఖ రాయించడం సిగ్గు చేటన్నారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా 5 వేల సభలు నిర్వహిస్తామని సోము వీర్రాజు చెప్పారు. 


Also Read : Chiranjeevi: రాజ్ భవన్‌కు మెగాస్టార్ చిరంజీవి, వారిని అభినందించిన గవర్నర్ తమిళిసై


Also Read : Governor Tamilisai: కు.ని. ఆపరేషన్ మరణాలు అందుకే జరిగాయి: గవర్నర్, అధికారులకు తమిళిసై వార్నింగ్