పూనమ్ కౌర్... తెలుగు, తమిళం, మలయాళం సినిమా పరిశ్రమల్లో పలు సినిమాలు చేసినా..  అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘మాయాజాలం’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో అడుగు పెట్టిన పూనమ్.. ‘ఒక విచిత్రం’, ‘నిక్కి అండ్ నీరజ్’ సహా పలు సినిమాలు చేసింది. ఏ సినిమా ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు. రానురాను.. ఆమె సినిమాలతో కంటే సోషల్ మీడియాలో ట్వీట్లు, రియాక్షన్స్‌తో ఫేమస్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన ట్వీట్స్ కొన్నిసార్లు చర్చకు దారి తీశాయి. కొన్ని రోజుల నుంచి సైలెంట్‌గా ఉన్న పూనమ్.. మళ్లీ యాక్టివ్ అయ్యింది. తాజాగా గుజరాత్ గ్యాంగ్ రేప్ నిందితుల విడుదలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆడవారి వస్త్రధారణపై కామెంట్స్ చేసే వారికి గట్టి కౌంటర్ ఇచ్చింది.


షీలా దీక్షిత్ కు చేనేత చీర.. 
తాజాగా ఈ ముద్దుగుమ్మ పాత విషయాలను గుర్తు చేసుకుంటోంది. దివంగత ఢిల్లీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ ను కలిసి ముచ్చటించిన వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. శక్తివంతమైన, వినయపూర్వకమైన మహిళతో సంభాషణ అంటూ క్యాప్షన్ పెట్టింది. గతంలో ఈ ముద్దుగుమ్మ  బుద్ధపూర్ణిమ సందర్భంగా ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ను కలిసి చేనేత వస్త్రాలు బహుకరించింది. అందరికీ బుద్ధపూర్ణిమ శుభాకాంక్షలు చెప్పింది. “శక్తివంతమైన, దయగల,  వినయపూర్వకమైన ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ అమ్మకు చేనేత వస్త్రాలను బహుకరిం చా. ఈ సందర్భంగా ఆ బుద్ధుడు అందరికీ శాంతి, ప్రేమ, సంతోషం అందించాలని కోరుకుంటున్నాను’’ అంటూ గతంలో తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. తాజాగా అదే విషయాన్ని మళ్లీ గుర్తు చేసుకుంది.






గ్లామర్ డోస్ పెంచిన పూనమ్ 
ఇక హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసిన పూనమ్ కౌర్.. ఆ తరువాత అవకాశాలు తగ్గడంతో చాలా తక్కువ సినిమాల్లో కనిపిస్తోంది. చివరగా నితిన్ నటించిన 'శ్రీనివాస కల్యాణం' సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ప్రస్తుతం ఒకట్రెండు ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నా.. అవి ఎప్పటికి రిలీజ్ అవుతాయో తెలియని పరిస్థితి.  పూనమ్ కౌర్ తాజాగా నటించిన సినిమా ‘నాతిచరామి’. క్రైమ్, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పూనమ్ కౌర్, అరవింద్ కృష్ణ, సందేశ్ బూరి సహా పలువురు నటించారు. నాగు గవర దర్శకత్వం వహించారు. జై వైష్ణవి నిర్మాతగా వ్యవహరించగా.. నవీన్ గణేష్ సంగీతం అందించారు.  హైద‌రాబాద్‌లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా కల్పిత పాత్రలతో తెరకెక్కించారు. ఈ సినిమాలో కవిత, మాధవి, జయశ్రీ రాచకొండ, కృష్ణ, సత్తన్న తదితరులు నటించారు.