Minister Chelluboina Venugopal : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి మోకాళ్లపై కూర్చుని నమస్కారం చేశారు. అమలాపురంలో మాజీ ఎమ్మెల్యే కూడిపూడి చిట్టాబ్బాయి సంస్మరణ సభలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు విశ్వరూప్, చెల్లిబోయిన వేణుగోపాల్, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సంస్మరణ సభలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి మోకాళ్లపై కూర్చుని దణ్ణం పెట్టారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. శెట్టిబలిజలకు అండగా నిలుస్తున్న సీఎం జగన్, సుబ్బారెడ్డికి శెట్టిబలిజల తరఫున కృతజ్ఞతలు అంటూ వేదికపైనే మోకాళ్లపై కూర్చుని నమస్కారం చేశారు. 



"శెట్టిబలిజలకు సీఎం జగన్ , వైవీ సుబ్బారెడ్డి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అందుకు శెట్టిబలిజ జాతీయుడిగా ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. రాజకీయాల్లో పదవిపోతే పట్టించుకోరు. చిట్టబ్బాయి ఈరోజు మన మధ్య లేకపోయినా శెట్టిబలిజల కోసం ఎంతో కృషి చేశారు. " అని మంత్రి వేణుగోపాల్ అన్నారు. 






ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంత్రి మోకాళ్లపై దణ్ణం పెట్టిన వీడియోను టీడీపీ పోస్టు చేసింది. దీనిపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇంకెన్నాళ్లు బానిసలుగా ఉంటారని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మంత్రి వీడియోపై మీమ్స్ తయారు చేస్తున్నారు.  


కేటీఆర్ ను ఏపీకి ఆహ్వానిస్తున్నాం 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల పరిశీలనకు తెలంగాణ మంత్రి కేటీఆర్ ను ఆహ్వానిస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. ఏపీ రాష్ట్రంలోని అభివృద్ధిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తీవ్రంగా స్పందించారు. కోనసీమ జిల్లా అమలాపురంలో మంత్రి విశ్వరూప్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో అమలు అవుతున్న సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో అమలు జరగడం లేదని మంత్రి విశ్వరూప్ పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శమని మంత్రి విశ్వరూప్ పేర్కొన్నారు. ఏపీ గ్రామ సచివాలయ వ్యవస్థను తమిళనాడులో అమలు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారని ఈ ఘనత తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. కోవిడ్ లో ప్రజలు ఇబ్బంది పడకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని ఇపుడు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తామని మంత్రి విశ్వరూప్ తెలిపారు. రానున్న ఆరు నెలల్లో రాష్ట్రంలోని అన్ని రోడ్లు నిర్మిస్తామని మంత్రి విశ్వరూప్ చెప్పారు.