Yadadri Building Collapse : తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. యాదగిరిగుట్టలో రెండు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. శిథిలాల ఇంకొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కుప్పకూలిన భవనంలో నివాస గృహాలు, వ్యాపార సముదాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 


శిథిలాల కింద కొందరు


రెండు అంతస్తుల భవనంలో రెండు షాపులు, వెనుక భాగంలో రెండు కుటుంబాలు నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఇళ్లలో, షాపుల్లో ఉన్న వారితో పాటు అక్కడికి వచ్చినవారు కొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని భువనగిరి ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాండేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ భవనాన్ని 35 ఏళ్ల కిందట కట్టారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. యాదగిరిగుట్టకు చెందిన దశరథ్‌గౌడ్‌, శ్రీను, ఉపేందర్‌, శ్రీనాథ్‌ ఈ ఘటనలో మరణించినట్లు పోలీసులు తెలిపారు.