Konaseema Cockfights : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి హెచ్చరికలతో కోనసీమలో కోడిపందేల బరులు వెలవెలబోతున్నాయి. సంక్రాంతి సందర్భంగా ప్రతీఏటా జరిగే మూడు రోజుల కోడి పందేలకు ఈసారి పుల్ ష్టాప్ పడినట్లే ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెద్ద పండుగకు వారం రోజుల ముందు నుంచే బరుల వద్ద ట్రాక్టర్లుతో చదును చేయిస్తూ కనిపించే పందేల నిర్వాహకులు అక్కడ కనీసం నిల్చోడానికి కూడా భయపడుతున్నారు. పందేల సన్నద్ధక పరిస్థితులు అటుంచితే కనీసం పండుగ మూడు రోజులైనా అవకాశం కల్పించాలని ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారట. కోనసీమలో గతంలో వారం రోజులు ముందు నుంచి కోడిపందాలు కోసం బరులు సిద్ధమయ్యేవి. అయితే ఆ పరిస్థితి పూర్తిగా కనుమరుగైంది. కోనసీమ వ్యాప్తంగా ఎక్కడా కూడా ఇంతవరకు బరులను సిద్ధం చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఒక్కరోజు మాత్రమే పండుగకు మిగిలి ఉండడంతో ఇక కోనసీమలో పందాలకు నో ఛాన్స్ అనే వాదనే వినిపిస్తుంది. ఇదే పరిస్థితి తూర్పుగోదావరి జిల్లా లోను కనిపిస్తుండగా ఆ జిల్లాకు కూడా సుధీర్ కుమార్ రెడ్డి ఇంఛార్జీ ఎస్పీగా వ్యవహరిస్తుండటం గమనార్హం.
ఒక వేళ చివరి నిమిషాల్లో పందేలకు అవకాశం కలిసొచ్చినా అక్కడ సహా జూదాలైన గుండాట, కోతటా ఇతర జూదాలు ఆడడానికి అవకాశం ఉండదని తెలుస్తుండడంతో ఆ ప్రయత్నాలు పందెం రాయుళ్లు మానుకుంటున్నారని తెలుస్తోంది. నిజానికి కోడిపందేలు పేరుకే కనిపిస్తున్నా వీటికంటే పెద్దఎత్తున గుండాట, ఇతర జూదాల విషయంలోనే నిర్వహకులు ఎక్కువగా లాభపడుతుంటారు. కోట్లలో ఇవి సాగుతుంటాయి. ఎస్పీ సుధీర్‌కుమార్ రెడ్డి అత్యంత కఠినంగా వ్యవహరిస్తుండడంతో ఆ ప్రయత్నాలను మానుకుంటున్నారని సమాచారం. దీంతో కోనసీమ వ్యాప్తంగా పదుల సంఖ్యలో కనిపించే బరులు కనుమరుగైన పరిస్థితి కనిపిస్తోంది. పండుగకు వారం రోజుల ముందు నుంచే ట్రాక్టర్లుతో చదును చేసే పరిస్థితి పూర్తిగా కనుమరుగైంది. దీంతో గతంలో బరులుగా వెలుగొందిన పలు ప్రాంతాలు వెలవెల బోతున్నాయి. ఆ ప్రాంతంలో పోలీసులు ఏర్పాటు చేసే హెచ్చరిక బోర్డులు అవసరం లేకుండా పోయింది.
25 ఏళ్ల క్రితం నాటి పరిస్థితి పునరావృతమవుతోందా?
సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి సందర్భంగా ఎప్పటిలా జరిగే కోడిపందేలు ఆగిపోయాయి. ఇప్పుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మళ్లీ ఆ నాటి పరిస్థితిలే కనిపిస్తున్నాయి. కారణం జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని నడిపే పోలీస్ బాస్ నిబద్ధతతోనే పందేలు ఆగడానికి కారణంగా నిలుస్తోంది. ఆనాడు ఖద్దరు సిఫారసులు, పైరవీలు అప్పటి ఎస్పీ బత్తెన శ్రీనివాసరావు ముందు ఏమాత్రం పనిచేయలేదు. ఇప్పుడు అటువంటి పరిస్థితే కోనసీమ జిల్లాలో కనిపిస్తోంది. చట్ట వ్యతిరేక చర్యలను ఉక్కుపాదంతో నియంత్రించగల సమర్ధనీయ అధికారిగా ఎస్పీ సుధీర్‌కుమార్ రెడ్డికి పేరుంది. ఒక్కసారి చెబితే అది నిఖార్సుగా అమలు చేసే తత్వం ఆయన సొంతం.. దీంతో పందెం రాయుళ్లు రాజకీయ నాయకులు చుట్టూ ప్రదక్షిణలు చేసినా, తాడేపల్లి నుంచి సిఫారుసులు చేయించినా అవేమీ ఇక్కడ పనిచేయడం లేదన్నది తాజా పరిస్థితులనుబట్టి తెలుస్తోంది. ఇప్పటికే గతంలో కోనసీమలో పెద్దస్థాయిలో పందేలు నిర్వహించిన బడా పందెం నిర్వాహకులు పక్క జిల్లాకు వలస కట్టారు. ఇక ఇక్కడే ఏదోలా ఏర్పాట్లు చేసుకోవాలని చూస్తున్నవారికి మాత్రం ఓపక్క వెన్నులో వణుకు పుడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
డైలమాలో నిర్వహకులు..
ఖద్దరు మాటలు ఏమాత్రం ఖాతరు కాని పరిస్థితుల్లో పందేల నిర్వాహకులు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి కనిపిస్తోంది. మూడు రోజుల పాటు అవకాశం కల్పించినా ఏం చేయగలం..? ముందస్తుగా ఏర్పాట్లుకు అవకాశం కల్పించకుంటే ఏం చేసేదని పెదవి విరుస్తున్నారట. అయితే ఎస్పీ సుధీర్‌కుమార్ రెడ్డి మూడు రోజుల పాటు శెలవుపై వెళ్తారని అంటూ జరుగుతోన్న ప్రచారం విపరీతంగా జరుగుతోంది. ఆ విధమైయిన వత్తిళ్ల కు తలోగ్గే తత్వం ఆయనది కాదు. అయినా ఈ మూడు రోజుల పాటు పందేలు జరుగుతాయని నాయకులు దీమా వ్యక్తంచేస్తున్నారట. ఇదిలా ఉంటే పందేల వద్ద కోడి పందేలతోపాటు గుండాట, మద్యం దుకాణాలు, ఇతర జూదాలు లేకుంటే పందేలు ఎలా నిర్వహించగలం, నిర్వహణ ఖర్చులు ఎలా సమకూరతాయి అంటూ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారట. అయితే ఎస్పీ కఠిన ఆదేశాలుతో అటు పందేల నిర్వహకుల్లోనిస్తేజం అలముకోగా ఇటు పోలీస్‌శాఖలోనూ కొందరిలో నిరుత్సాహం కనిపిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
కాకినాడ జిల్లాలో సిద్ధమవుతున్న బరులు
కోనసీమ జిల్లా ఎస్పీ ఖటిజంగా వ్యవహరిస్తుండటంతో కాకినాడ జిల్లా పరిధిలోకి పందెం రాయుళ్లు వరుస కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే తాళ్ళరేవు మండల పరిధిలోని పలు గ్రామాలలో బరులను సిద్ధం చేస్తున్నారు. కోనసీమలో గతంలో వారం రోజులు ముందు నుంచి కోడిపందాలు కోసం బరులు సిద్ధమయ్యేవి.. అయితే ఆ పరిస్థితి పూర్తిగా కనుమరుగైంది. కానీ కాకినాడ జిల్లా లో మాత్రం బరులు ఏర్పాట్లు చక చకా జరిగిపోతున్నాయి.
హెచ్చరించిన జిల్లా కలెక్టర్..
రాష్ట్ర హైకోర్టు ఆదేశాల ప్రకారం కోడిపందేలు, జూదాలు, అక్రమ మద్యం విక్రయాలు వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలు చేయవద్దని డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా హితవు పలికారు. కోడిపందేల జరిగే ప్రదేశాల్లో 144 సెక్షన్ కింద ఉత్తర్వులు జారీ చేశామని, శాంతి భద్రతల విషయంలో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ద్వారా చర్యలు తీసకుంటున్నామన్నారు. జంతువులను క్రూరత్వానికి గురిచేసే చర్యలు, జూదాలు, అక్రమ మద్యం తదితర అసంఘిక కార్యకలాపాలపై గ్రామస్థాయి నుంచి మండల, జిల్లా స్థాయి వరకు కట్టుదిట్టమైన యంత్రాంగం పనిచేస్తుందన్నారు