Minister KTR : మంచి ఆలోచన ఉన్న స్టార్టప్ లకు నిధులు ఇబ్బంది కాదని మంత్రి కేటీఆర్ అన్నారు. డల్లాస్ వెంచర్ క్యాపిటల్‌తో టీ హబ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియా ఫండ్ పేరుతో టీ హబ్‌కు డల్లాస్ వెంచర్ నిధులు సమకూర్చుతుంది. హైదరాబాద్ టీ హబ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... డల్లాస్ వెంచర్ కంపెనీకి అభినందనలు తెలిపారు. డల్లాస్ వెంచర్ సంస్థ భారత్‌లో అనేక స్టార్టప్స్ నెలకొల్పిందన్నారు. భారత్‌లో ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచన గొప్పదని మంత్రి కేటీఆర్ కొనియాడారు. హైదరాబాద్‌లో సుమారు ఆరు వేల స్టార్టప్‌లు ఉన్నాయని గుర్తుచేశారు. భారత్ ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని, దేశంలో పెట్టుబడులు రాబట్టడం కష్టం కాదని స్పష్టం చేశారు. మంచి ఆలోచన ఉన్న స్టార్టప్‌లకు నిధులు కొరత లేదన్నారు. దేశంలో తొలి ప్రైవేటు రాకెట్ టీ హబ్ పనిచేస్తున్న స్టార్టప్ నుంచే వచ్చిందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ధ్రువ స్పేస్ సైతం హైదరాబాద్ నుంచి వచ్చి మొదటి ప్రయోగంలోనే నానో రాకెట్స్‌ని విజయవంతంగా ప్రయోగించిందని కేటీఆర్ తెలిపారు.
టీహబ్ స్టార్టప్ లకు చిరునామా
కొత్త స్టార్టప్ లకు టీ హబ్ కేరాఫ్ అడ్రస్ గా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రారంభించిన ఏడాదిలోనే అద్భుత పనితీరుతో టీహబ్ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. డల్లాస్ వెంచర్ క్యాపిటల్ సంస్థ భారత్‌లో అనేక స్టార్టప్స్ నెలకొల్పిందని కేటీఆర్. దేశంలో 25 వేల ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచన గొప్పదన్నారు. దేశంలో స్టార్టప్ లకు నిధుల కొరతలేదని, కానీ స్టార్టప్‌లను ఎలా నిర్వహిస్తారు? డబ్బు వృథా కాకుండా వ్యాపారాన్ని ఎలా వృద్ధి చేస్తారనేదే కీలకం అన్నారు. దేశంలో అనేక రంగాల్లో స్టార్టప్‌లు వస్తున్నాయని తెలిపారు.
పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి కేటీఆర్ భేటీ
తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం ముంబయిలో పర్యటించారు. ముంబైలో పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ తో టాటా కార్పొరేట్ కేంద్ర కార్యాలయం బాంబే హౌస్ లో మంత్రి కేటీఆర్ సమావేశమై వివిధ వ్యాపార వాణిజ్య అవకాశాల పైన చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, తమ ప్రభుత్వం అమలుచేస్తున్న అత్యుత్తమ పారిశ్రామిక విధానాలపై మాట్లాడిన మంత్రి కేటీఆర్, తెలంగాణ రాష్ట్రంలో టాటా గ్రూపు కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ఉన్న అవకాశాలను ఆయా రంగాల వారీగా వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపార అనుకూల పరిస్థితులు, అవకాశాలను దృష్టిలో ఉంచుకొని టాటా గ్రూపు వివిధ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు. టాటా గ్రూపు వివిధ రంగాల్లో చేపట్టనున్న విస్తరణ ప్రణాళికలో తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా చంద్రశేఖరన్ ను కేటీఆర్ కోరారు.
వరంగల్ కు టీసీఎస్ కార్యకలాపాల విస్తరించాలని కోరిన కేటీఆర్
ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగంలో హైదరాబాద్ కేంద్రంగా టాటా గ్రూప్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని తెలిపిన కేటీఆర్, టిసిఎస్ కార్యకలాపాలను వరంగల్ కు విస్తరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీ ప్రణాళికలతో టాటా గ్రూప్ ముందుకు పోతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఎలక్ట్రానిక్స్ పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని వివరించిన కేటీఆర్, ఈ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. విమానయాన రంగంలో టాటా సంస్థ మంచి పురోగతి సాగిస్తున్న నేపథ్యంలో... హైదరాబాదులో ఒక ఎమ్మార్వో Maintenance, Repair, and Overhaul (MRO) కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేటీఆర్ కోరారు.