Giridhar Gamang Meets KCR :   : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్‌ గమాంగ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎంతో కాసేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జాతీయ రాజకీయాల గురించి ఇరువురూ చర్చించుకున్నారు. ఈ భేటీలో గిరిధర్‌ కుమారుడు శిశిర్‌ గమాంగ్‌, ఇతర నేతలు పాల్గొన్నారు.బీఆర్‌ఎస్‌ పార్టీని ప్రకటించిన తర్వాత దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు సీఎం కేసీఆర్‌ను కలుస్తున్నారు. దేశంలో నెలకొన్న సమస్యలు, ఇతర అంశాలపై చర్చంచారు. 


చాలా కాలంగా రాజకీయాల్లో సైలెంట్ గా ఉన్న గిరిధర్ గమాంగ్


గిరిధర్ గమాంగ్ పలుమార్పు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. 1999లో ఆరేడు నెలల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఎంపీగా ఉన్న సమయంలో ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఎంపీ పదవికి రాజీనామా చేయలేదు. ఆ సమయంలో ప్రధానమంత్రిగా వాజ్ పేయి ఉండేవారు. అప్పుడు జరిగిన విశ్వాస పరీక్షలో సీఎంగా ఉన్నప్పటికీ ఎంపీ పదవికి రాజీనామా చేయకపోవడంతో వచ్చి ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇది నైతిక విరుద్ధమన్న ప్రచారం జరిగింది.  అప్పట్లో బలాబలాలు చాలా క్లిష్టంగా ఉండటంతో చివరికి ఒక్క ఓటు తేడాతో వాజ్ పేయి ప్రభుత్వం కూలిపోయింది. ఈ కారణంగా ఎన్నికలు వచ్చాయి. అయితే అప్పటి నుండి ఆయన మరోసారి ఎన్నికల్లో గెలవలేకపోయారు. 


కొన్నాళ్ల క్రితం బీజేపీలో చేరిన గమాంగ్ 


ఆ తరవాత ఆయన కాంగ్రెస్ పార్టీకి కూడా దూరమయ్యారు. ఒరిస్సా సంప్రదాయ కళాకారుడు కావడంతో ఆయన  ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. కొంత కాలం కిందట బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన  బీజేపీ నేతగా ఉన్నారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు ఆయన ప్రగతి భవన్ వచ్చి కలిసినట్లుగా తెలుస్తోంది. అయితే ఆయన కానీ ఆయన కుమారుడు కానీ బీఆర్ఎస్‌లో చేరుతారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ప్రస్తుతం వయసు కారణంగా గిరిధర్ గమాంగ్ యాక్టివ్ గా ఉండలేకపోయారు. ఆయన తన రాజకీయ వారసుడిగా చెబుతున్న కుమారుడు శిశిర్ గమాంగ్ రాజకీయ భవిష్యత్ ను తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీలోనూ ప్రస్తుతానికి ఆయనకు ప్రాధాన్యత లేదు. అందుకే కేసీఆర్ ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీ కి తెలంగాణ చీఫ్ గా ఉండాలనే ఆఫర్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. దీన్ని ఆయన అంగీకరించారా లేదా అన్నదానపై క్లారిటీ రావాల్సి ఉంది. 


బీఆర్ఎస్‌లో చేరేందుకు అంగీకరించినట్లేనా ?


 ఇప్పటికే సీఎం కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ పార్టీ ఏపీ అధ్యక్షుడిని ప్రకటించారు. జనసేన నాయకుడు తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.  మరోవైపు ఈనెల 18వ తేదీన ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు దేశ నలమూలల నుంచి పలువురు రాజకీయ నేతలు, రైతు సంఘం నాయకులు హాజరుకాబోతున్నారు. ఈ సభలోనే మరికొన్ని రాష్ట్రాల అధ్యక్షులను కూడా  ప్రకిటంచే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.