AP Deputy Speaker :  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు ఇచ్చారు. తమ్మినేని ఆ రాజీనామాను ఆమోదించారు. ఈ సమావేశాల్లో మరో డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకునే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాల కారణంగా కోన రఘుపతిని రాజీనామా చేయాలని సీఎం జగన్ కోరినట్లుగా వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల మంత్రి వర్గ విస్తరణ తర్వాత కొన్ని పదవుల్లో మార్పుచేర్పులుచేయాలనుకున్నారు. ఇటీవలే ఏపీ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్‌గా మల్లాది విష్ణును నియమించారు. చీఫ్ విప్‌గా శ్రీకాంత్  రెడ్డిని తొలగించి ప్రసాదరాజును నియమించారు. 


సామాజిక సమీకరణాలతో  కోన రఘుపతిని తప్పించి కోలగట్ల వీరభద్రస్వామికి చాన్సిస్తున్న సీఎం జగన్ 


ఇప్పుడు కోన రఘుపతిని తొలగించి ఆ స్థానాన్ని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. గత మంత్రి వర్గ విస్తరణ సమయంలో  మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావును మంత్రిగా తొలగించారు. కానీ ఆయన సామాజికవర్గానికి చెందిన మరెవరికీ మంత్రి పదవి ఇవ్వలేదు. ఈ కారణంగా డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలనుకున్నారు. మంత్రి పదవి ఆశించిన కోలగట్ల వీరభద్ర స్వామికి ఈ పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కోన రఘుపతితో రాజీనామా చేయించినట్లుగా తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి మూడున్నరేళ్ల వరకూ ఉన్నారు. వచ్చే ఏడాదిన్నర వరకూ ఆ పదవిలో కోలగట్ల వీరభద్రస్వామి ఉండే అవకాశం ఉంది. 


రెండు  సార్లు మంత్రి పదవి ఆశించిన కోల గట్ల వీరభద్ర స్వామి


కోలగట్ల వీరభద్ర స్వామి సీనియర్ నేత. వైఎస్ఆర్‌సీపీ పార్టీని తొలినుంచి అంటిపెట్టుకున్న లీడర్. ఆయనకు తొలిమంత్రివర్గంలోనే చోటు దక్కుతుందని అందరూ భావించారు. కానీ వైశ్య సామాజికవర్గం కోటాలో వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఆ పదవి కేటాయించారు. రెండో విడత అయినా దక్కుతుందని భావించినా కొన్ని రాజకీయ కారణాల వల్ల అది వీలు కాలేదు. ఇప్పుడు ఆయనకు కేబినెట్ హోదాతో డిప్యూటీ స్పీకర్ పదవిని అప్పగిస్తున్నారు. కోలగట్ల వీరభద్రస్వామి డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నిక అయితే.. స్పీకర్.. డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ ఉత్తారంధ్ర ప్రాంతానికి చెందిన వారే ఉంటారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాకు చెందిన తమ్మినేని సీతారాం స్పీకర్‌గా ఉన్నారు. 


ఈ సమావేశాల్లోనే నోటిఫికేషన్... డిప్యూటీ స్పీకర్ ఎన్నిక


గత అసెంబ్లీ సమావేశాల్లో కోలగట్ల వీరభద్రస్వామిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకుంటారని అనుకున్నారు. కానీ అప్పట్లో ఎందుకనో కోన రఘుపతి రాజీనామా చేయలేదు. దాంతో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కు నోటిఫికేషన్ విడుదల కాలేదు. ఇప్పుడు కోన రఘఉపతి రాజీనామా చేయడం.. స్పీకర్ ఆమోదించడం జరిగింది. దీంతో ఈ సమావేశాల్లోనే నోటిఫికేషన్ విడుదల చేసి ..కోలగట్ల వీరభద్ర స్వామిని స్పీకర్‌గా ఎన్నుకునే ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది. 


రాజకీయ విమర్శల్లో కుటుంబసభ్యుల జోలికెందుకు ? ఆపేద్దామని అచ్చెన్నకు సీఎం జగన్ సలహా !