Kodali Nani On  Sharmila :  షర్మిల కాంగ్రెస్‌లో చేరడంపై వైసీపీ నేతలు రకరకాలుగా స్పందిస్తున్నారు. అందులో కొడాలి నాని కొత్తగా ఆలోచించారు. ఆయన ఈ ఇష్యూలోకి పురందేశ్వరిని తీసుకు వచ్చారు.  వైసీపీపై షర్మిల ప్రభావం ఉండదని కొడాలి నాని తేల్చి చెప్పారు. అంతేకాదు ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి పేరుని ఆయన తెరపైకి తెచ్చారు. ఎన్టీఆర్ కూతురు బీజేపీ అధ్యక్షురాలు అయినట్లే, వైఎస్ కూతురు కాంగ్రెస్ కు అధ్యక్షురాలు అవుతుందేమో అని కామెంట్ చేశారు. 


పురందేశ్వరి, షర్మిల సేమ్ టు సేమ్ 


పురంధేశ్వరి టీడీపీ ఓట్లు ఎన్ని చీల్చగలదో షర్మిల కూడా వైసీపీలో అన్నే ఓట్లు చీల్చగలదని కొడాలి నాని వ్యాఖ్యానించారు. పురంధేశ్వరి ప్రభావం టీడీపీపై ఎంత ఉంటుందో.. షర్మిల ప్రభావం వైసీపీపై అంతే ఉంటుందన్నారు కొడాలి నాని.”ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా ఉండి, 175 సీట్లు పోటీ చేస్తే టీడీపీ లాభమా? నష్టమా? ఎంతవరకు డ్యామేజ్ అవుతుంది? ఎన్టీఆర్ కూతురు బీజేపీలో ఉంటే అక్కడ ప్రభావం చూపించనప్పుడు ఇక్కడ మాత్రం ఏం ప్రభావం చూపిస్తారు? దాని వల్ల టీడీపీకి ఎంత డ్యామేజీ ఉంటుందో కాంగ్రెస్ వల్ల, వైఎస్ షర్మిల వల్ల మా పార్టీకి అంతే డ్యామేజ్ ఉంటుంది” అని కొడాలి నాని అన్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరితే.. బీజేపీ నేత పురందేశ్వరిని ఎందుకు ఈ ఇష్యూలోకి తీసుకు వచ్చారన్నది ఆసక్తికరంగా మారింది.గతంలోనూ కొడాలి నాని పురందేశ్వరిపై విమర్శలు చేసేవారు. 


రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన షర్మిల


వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) ఆశయ సాధనం కోసం కాంగ్రెస్ పార్టీలో పని చేస్తానని వైఎస్ షర్మిల (YS Sharmila) తెలిపారు. గురువారం ఉదయం తన భర్త అనిల్ తో కలిసి ఢిల్లీ (Delhi) ఏఐసీసీ కార్యాలయంలో ఆమె కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ (Rajhul Gandhi), ఖర్గే సమక్షంలో వైఎస్సార్టీపీని (Ysrtp) కాంగ్రెస్ (Congress) లో విలీనం చేశారు. ఖర్గే ఆమెకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి సాదరంగా ఆహ్వానించారు. తనకు ఏ బాధ్యత అప్పగించినా నిబద్ధతతో పని చేస్తానని ఈ సందర్భంగా షర్మిల స్పష్టం చేశారు. 'కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు సంతోషంగా ఉంది. దేశంలో అతి పెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్. అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత హస్తం పార్టీది. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసినందుకు సంతోషంగా ఉంది. వైఎస్ జీవితాంతం కాంగ్రెస్ పార్టీ కోసం పని చేశారు. నేను వైఎస్ అడుగుజాడల్లో నడుస్తాను.' అని షర్మిల పేర్కొన్నారు.
 
 షర్మిలకు ఏ బాధ్యతలు..?


కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిన నేపథ్యంలో ఆమెకు అప్పగించే బాధ్యతలపై ఆసక్తి నెలకొంది. ఏఐసీసీలో పదవి ఇస్తారా.? లేదా ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారా.? అనేది తెలియాల్సి ఉంది. అయితే, షర్మిలకు ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ పగ్గాలు అప్పగించేందుకు రాహుల్‌ మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఇటీవల ఢిల్లీలో రాష్ట్ర నేతలతో జరిగిన సమావేశంలో.. ఆయన,  మల్లికార్జునఖర్గే ప్రత్యేకంగా షర్మిల ప్రస్తావన తీసుకొచ్చినట్టు వార్తలు వచ్చాయి. రాష్ట్ర కాంగ్రెస్‌లో షర్మిలకు ప్రాధాన్యం ఉంటుందని రాహుల్‌ గాంధీ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఆమెకు ఏపీ పగ్గాలు అప్పగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ, అదే జరిగితే ఏపీలో అన్నాచెల్లెళ్ల మధ్య రాజకీయం మరింత ఆసక్తిగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అప్పట్లో, వైసీపీ తరఫున ఆమె పాదయాత్ర చేసి తన అన్న జగన్ కు అండగా నిలిచారు. అనంతరం తెలంగాణలో పార్టీని స్థాపించి ఇప్పుడు కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఈ క్రమంలో రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అనేది అందరిలోనూ ఆసక్తిగా మారింది.