Kerala Style Boat Racing In Atreyapuram: సంక్రాంతి పండుగ అంటేనే కోనసీమ (Konaseema) జిల్లాలకు పెట్టింది పేరు. కోడి పందేలతో పాటు గుండాట ఇతర వంటివి ఇక్కడ ప్రత్యేకం. మినీ కేరళగా పేరొందిన కోనసీమలో కొత్తగా పడవ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంక్రాంతి పురస్కరించుకుని ఎమ్మెల్యే సత్యానందరావు ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. దీంతో పాటే ఈత పోటీలు సైతం నిర్వహించారు. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పోటీల్లో భాగంగా వీటిని నిర్వహిస్తున్నారు. ఆత్రేయపురం (Atreyapuram) ప్రధాన పంట కాల్వలో ఈ పోటీలు జరుగుతుండగా.. వీటిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో జనం తరలివచ్చారు. ఈ పోటీలు 3 రోజుల పాటు సాగనున్నాయి. మహిళలకు రంగవల్లుల పోటీలతో పాటు పతంగుల పోటీలను సైతం వైభవంగా నిర్వహించారు.
రెండో రోజు పడవ పోటీల్లో భాగంగా డ్రాగన్, కయాకింగ్, కానోయింగ్ విభాగాల్లో జరిగాయి. వివిధ జిల్లాలకు చెందిన 11 పురుషుల, మహిళల జట్లు పోటీపడ్డాయి. పోటీలు ఆధ్యంతం హోరాహోరీగా సాగాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి పోటీలను తిలకించారు. సోమవారం సెమీ ఫైనల్స్, ఫైనల్స్ అనంతరం బహుమతి ప్రదానం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. అటు, అమెరికా నుంచి సంక్రాంతికి స్వదేశానికి విచ్చేసిన 70 ఏళ్లు పైబడిన వృద్ధురాలు స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనడం విశేషంగా నిలిచింది.