CM Revanth Reddy: 'భేషజాలు లేవు, ఎవరి సలహాలనైనా స్వీకరిస్తాను' - పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు

Telangana News: రాష్ట్ర అంశాలపై అన్ని పార్టీలు కలిసి పని చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు ఆత్మకథ 'ఉనిక' పుస్తకావిష్కరణలో ఆయన పాల్గొన్నారు.

Continues below advertisement

CM Revanth Reddy Key Comments In UNIKA Book Launching Event: తనకు ఎలాంటి భేషజాలు లేవని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరి సలహాలనైనా స్వీకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. భాగ్యనగరంలో మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు (Vidyasagar Rao) ఆత్మకథ 'ఉనిక చెన్నమనేని స్వీయ చరిత్ర' (Unika) పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆయన అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమానికి తెలంగాణలోని అన్ని ప్రముఖ పార్టీల నేతలు హాజరయ్యారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, (Bandi Sanjay) గవర్నర్లు బండారు దత్తాత్రేయ, హరిబాబు, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య, ఎంపీ లక్ష్మణ్, రచయిత అందెశ్రీ, బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Continues below advertisement

విపక్ష నేతలైనా..

విపక్ష నేతలైనా అవసరం ఉన్న చోట వారి అనుభవాన్ని ఉపయోగించుకుంటామని సీఎం రేవంత్ తెలిపారు. 'పాలకపక్షం, ప్రతిపక్షం కలిస్తేనే ప్రభుత్వం. సభలో పాలకపక్ష నేతకు ఎంత ప్రాధాన్యముండేదో.. ప్రతిపక్ష నేతకు అంతే ప్రాధాన్యం ఉండేది. కాలక్రమంలో ఆ స్ఫూర్తిని కోల్పోయాం. సభలో ఇప్పటివరకూ ఒక ప్రతిపక్ష సభ్యున్ని మేం సస్పెండ్ చేయలేదు. గోదావరి జలాల సద్వినియోగం కోసం విద్యాసాగర్‌రావు అనుభవం రాష్ట్రానికి అవసరం. ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా ఉన్నారు. వారితో మాట్లాడి భూ సేకరణకు సహకరించాలి. తెలంగాణ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగడానికి కృషి చేస్తున్నాం. మెట్రో, రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో కేంద్రం సహకరించాలని ప్రధాని మోదీని కోరాను. కేంద్రం సహకరిస్తేనే రాష్ట్రాల అభివృద్ధి పూర్తవుతుంది. హైదరాబాద్ మెట్రోకు అనుమతులు తెచ్చుకోవాల్సిన అవసరముంది. ఒకప్పుడు రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో.. నేడు 9వ స్థానానికి పడిపోయింది. కొన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీలు కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నాయి. మనం పోటీ పడాల్సింది అమరావతితో కాదు ప్రపంచస్థాయి నగరాలతో. రాష్ట్ర అంశాలపై ఇక్కడ కూడా అన్ని పార్టీలు కలిసి పని చేద్దాం.'  అని సీఎం పిలుపునిచ్చారు.

'భిన్నాభిప్రాయాలు ఓకే కానీ..'

నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండొచ్చని.. కానీ మనస్పర్థలు మాత్రం రాకూడదని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. విద్యాసాగర్‌రావుతో 40 ఏళ్లు కలిసి పని చేశానని చెప్పారు. రాష్ట్రంలో ఏబీవీపీ, బీజేపీ ఎదుగుదలకు ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు. గోదావరి జలాలు మళ్లిస్తే తప్ప తెలంగాణ బతుకు లేదని ఎన్నో ఏళ్ల క్రితమే విద్యాసాగర్‌రావు చెప్పారని గుర్తు చేశారు. రాయలసీమకూ 100 టీఎంసీలు తరలించాలని ఆయన ఆకాంక్షించారన్నారు.

'అదే పెద్ద సవాల్'

దేశంలో ఇంకా ఐదో వంతు పేదరికం ఉందని.. దానికి పరిష్కారం చూపాలని మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు అన్నారు. 'యువతలోని శ్రమశక్తిని బయటకు తీయడమే ఇప్పటి నేతలకు అసలైన సవాల్. వారిని ప్రోత్సహించకుంటే దురలవాట్లకు లోనవుతారు. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ఆలోచన అభినందనీయం. గిరిజన ప్రాంతాల్లోని రూ.వేల కోట్ల విలువైన సంపదను వెలికితీసి దాన్ని వారి అభివృద్ధికి వినియోగించాలి. హైడ్రా తరహాలోనే గిరిజన భూ సమస్యల పరిష్కారానికి ఓ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.' అని పేర్కొన్నారు.

Also Read: Indiramma Houses: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్- కొత్త రేషన్ కార్డులు జారీ, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై కీలక ప్రకటన

Continues below advertisement