Mudragada Padmanabham meeting with TDP leader Maganti Babu  :   ఏలూరులో  టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబుతో  ముద్రగడ పద్మనాభం సమావేశం అయ్యారు.  మాగంటి బాబు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు  తాజా రాజకీయ అంశాలపైనా ఇరువురి మధ్య చర్చ జరగింది. టీడీపీ – జనసేన పొత్తుకు తన మద్దతు ఉంటుందని మాగంటి బాబుకు ముద్రగడ తెలిపారు. జనసేన పార్టీలో చేరే విషయంపైనే తమ భేటీ జరిగినట్లు టీడీపీ నేత మాగంటి బాబు స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగిందని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. 


కోట్లు పెట్టగలిగితేనే వైసీపీలో సీటు వస్తుందని.. తమ లాంటి వారికి అన్యాయం జరుగుతుందని ముద్రగడ వాపోయారని మాగంటి బాబు పేర్కొన్నారు. జగనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముద్రగడ చెప్పినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు తాము కూడా ముద్రగడను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. జనసేనలో పార్టీలో చేరిక విషయంపైనే తమ భేటీలో ప్రధానంగా చర్చ జరిగిందని మాగంటి బాబు తెలిపారు.   తమ ఫ్యామిలీతో ముద్రగడకు ఎప్పటినుంచో రాజకీయ అనుబంధం ఉందని మాగంటి బాబు చెప్పారు. ఆ అభిమానంతో తనను ముద్రగడ కలిశారని ఆయన తెలిపారు. తామంటే ముద్రగడకు చాలా గౌరవం ఉందని చెప్పారు. తాము పిలిచినా పిలవకపోయిన  తమను కలిసేంత అనుంబంధం ముద్రగడతో ఉందని వ్యాఖ్యానించారు. 


తామంతా ఒకప్పుడు కాంగ్రెస్‌లో నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చామని వెల్లడించారు. టీడీపీ, జనసేన అధికారంలో వస్తే అందరినీ కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మాగంటి బాబు తెలిపారు. ముద్రగడ పద్మనాభం టీడీపీలోకి వచ్చినా సరే.. జనసేనలో చేరినా తమకు ఓకేనని తెలిపారు. జనసేనలో చేరేందుకు ముద్రగడ పద్మనాభం సిద్ధంగా ఉన్నారని.. ఈమేరకు చర్చలు జరుగుతున్నాయన్నారు. అటు పవన్‌తోనూ చర్చిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే పవన్‌తో ముద్రగడ భేటీ అవుతారని మాగంటి బాబు వెల్లడించారు.


ముద్రగడ పద్మనాభం ఇటీవలి కాలం వరకూ వైసీపీతో  సన్నిహితంగా ఉన్నారు. పవన్, టీడీపీపై తీవ్ర విమర్శలు చేసేవారు. అయితే ఇటీవల  వైసీపీ ఆయనకు టిక్కెట్ ఇవ్వడానికి ఆసక్తి చూపించకపోవడంతో ఆయన నిరాశకు గురయ్యారు. జనవరి ఒకటో తేదీన వైసీపీలో చేరుతానని ప్రకటన చేసేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నా ప్రయోజనం లేకపోయింది.  కానీ వైసీపీ నుంచి స్పందన లేకపోవడంతో ఆ పార్టీకి దూరమయ్యారు.