CM Jagan : వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కమలాపురం నియోజకవర్గంలో రూ.900 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కమలాపురం ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం జగన్ మాట్లాడారు. కమలాపురం నియోజకవర్గంలో ప్రారంభోత్సవాలు చేయడం సంతోషంగా ఉందని సీఎం అన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇవాళ శ్రీకారం చుట్టామన్నారు. వైఎస్సార్ జిల్లాకు కృష్ణా నీటిని తీసుకురావడానికి దివంగత నేత వైఎస్ఆర్ కారణమని జగన్ తెలిపారు. గాలేరు-నగరిని తీసుకొచ్చేందుకు వైఎస్ఆర్ ఎంతో కృషి చేశారన్నారు. వైఎస్ఆర్ కృషితోనే గండికోట ప్రాజెక్టును పూర్తి చేశామని గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టులు నిలిచిపోయాయని విమర్శించారు. రూ. 550 కోట్లతో బ్రహ్మంసాగర్ లైనింగ్ పనులు చేపట్టామని సీఎం జగన్ తెలిపారు. చిత్రావతి ప్రాజెక్టులో నీటిని నిల్వ చేశామన్నారు. కొప్పర్తిలో ఇండస్ట్రీయల్ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. ఇండస్ట్రీయల్ పార్క్ పూర్తయితే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు.
జనవరిలో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం
కమలాపురంలో రూ. 1017 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని సీఎం జగన్ అన్నారు. బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామన్నారు. రాష్ట్ర విభజన సమయంలో స్టీల్‌ప్లాంట్ కడతామని హామీ ఇచ్చారని, కానీ గత పాలకులు ఆ హామీలను పట్టించుకోలేదన్నారు. జనవరి నెలాఖరులో కడప స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి అడుగులు పడతాయన్నారు. కడప స్టీల్‌ప్లాంట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. జిందాల్ కంపెనీ ఆధ్వర్యంలో రూ. 8800 కోట్లతో స్టీల్‌ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నట్లు సీఎం జగన్ తెలిపారు.
ఏపీలోనే నా రాజకీయం
"ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ అని అనడంలేదు. ఇదే నా రాష్ట్రం ఇక్కడే నా రాజకీయం. చంద్రబాబులాగా ఈ రాష్ట్రం కాకపోతే మరో రాష్ట్రం అని మాట్లాడను. దత్తపుత్రుడి లాగా ఈ భార్య కాకపోతే మరో భార్య అని నేను అనడం లేదు. నేను ఏపీలోనే ఉంటాను. ఐదు కోట్ల ప్రజలనే నా కుటుంబం. ఇక్కడి ప్రజల ఇంటింటి సంతోషమే నా విధానం. రాజకీయ నాయకుడికి విశ్వసనీయత చాలా ముఖ్యం. ఇదే నా రాష్ట్రం, ఇదే నా కుటుంబం. ప్రజా సంక్షేమమే మా ప్రభుత్వ విధానం. చంద్రబాబు మాదిరిగా ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రమని నేను అనను. ఈ పార్టీ కాకపోతే, మరో పార్టీ అని నేను అనడంలేదు. " - సీఎం జగన్
వైఎస్సార్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు
మూడు రోజుల పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్... పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కమలాపురంలో రూ. 900 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అంతకు ముందు కడప అమీన్ పీర్ దర్గాను దర్శించుకుని చాదర్ సమర్పించారు. ఆ తర్వాత ఆర్టీసీ చైర్మన్ మల్లిఖార్జున రెడ్డి కుమార్తె హారిక వివాహ వేడుకకు హాజరై నవదంపతులను ఆశీర్వదించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆఫ్జల్ ఖాన్ కుమారుడి వివాహ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు.