Anantapuram TDP :  అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో గ్రూపుల గొడవలు ఘర్షణకు కారణం  అవుతున్నాయి. కల్యాణదుర్గం నియోజకవర్గంపై పార్టీ సమీక్షా సమావేశంలో రెండు వర్గాలు కుర్చీలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటన కలకలం రేపింది. సమావేశం ఆర్థాంతరంగా ముగిసింది. కల్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి వర్గం,  ప్రస్తుత ఇంచార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు వర్గం .. తమకంటే తమకు ప్రాధాన్యం ఇవ్వాలని వాదులటాకు దిగుతూ ఉంటాయి. గతంలో ఉన్నం హనుమంతరాయ చౌదరి ఎమ్మెల్యేగా ఉండేవారు. గత ఎన్నికల్లో ఆయన వయసు కారణంగా టిక్కెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో ఉమామహేశ్వర్ నాయుడుకు చంద్రబాబుకు చాన్సిచ్చారు. అయితే ఆయన నెగ్గలేదు. 


కల్యాణదుర్గం టీడీపీలో హనుమంతరాయ చౌదరి వర్సెస్ ఉమా మహేశ్వర్ నాయుడు 


కానీ ఉన్నం హనుమంతరాయ చౌదరి వర్గీయులు మాత్రం.. తమకే్ ఇంచార్జ్ పదవి ఇవ్నాలని పట్టుబడుతూ  వస్తున్నారు. కానీ ఉమమహేశ్వర్ నాయుడు మాత్రం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినందున ఆయనే ఇంచార్జ్ గా కొనసాగుతున్నారు. పార్టీ తరపున ఏ కార్యక్రమం చేపట్టినా రెండు వర్గాలు పోటీ పడి వివాదాలు సృష్టిస్తూ ఉంటాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున.. వివాదాలను సద్దుమణిగేలా చేసేందుకు హైకమాండ్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో నియోజకవర్గ సమీక్షా సమావేశం ఏర్పాటు చేసింది. మాజీ మంత్రి , టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు .


ఇంచార్జ్ పదవి విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ 


సమావేశం ప్రారంభమైన కాసేటికే ఉమామహేశ్వర్ నాయుడును ఇంచార్జ్ పదవి నుంచి తొలగించి తమకు చాన్సివ్వాలని హనుమంతరాయ చౌదరి వర్గం పట్టుబట్టింది. వారికి ఉమామహేశ్వర్ నాయుడు వర్గీయులు అడ్డుపడటంతో.. మాటా మాటా పెరిగింది. చివరికి అది దాడుకు దారి తీసింది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు కుర్చీలతో దాడులకు దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రెండు వర్గాలను  సముదాయించడానికి చాలా సమయం పట్టింది. వీరి వ్యవహారంపై సమావేశానికి వచ్చిన టీడీపీ ముఖ్య నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలోని వర్గాలే ఇలా కొట్లాటకు దిగడం ఏమిటని మండిపడ్డారు. 


పార్టీ నేతల మధ్య గొడవలపై దృష్టి పెట్టని టీడీపీ అధినేత 


అనంతపురం జిల్లాలో టీడీపీకి ముఖ్య నేతలు ఉన్నప్పటికీ వారి మధ్య సమన్యవం లేకపోవడంతో తరచూ వివాదాలు తలెత్తుతున్నాయి. అయితే వీరి మధ్య సయోధ్య కుదర్చడంలో టీడీపీ హైకమాండ్ ఎప్పుడూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తూనే ఉంది. దీంతో ఎప్పటికప్పుడు అవి పెరిగిపోతున్నాయి. పార్టీ నేతల ఆధిపత్య పోరాటంతో అధికార పక్షం మీద పోరాడటం కన్నా.. తమలో తాము రాజకీయాలు చేసుకోవడానికే టీడీపీ నేతలకు సమయం సరిపోవడం లేదన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. 


అయన్న పాత్రుడిపై పెట్టిన సెక్షన్లు చెల్లవన్న హైకోర్టు - సీఐడీ విచారణ కొనసాగింపునకు ఓకే !