Kalava Srinivasulu: సీఎం జగన్ చేతగానితనంలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ తుగ్లక్‌లా వ్యహరిస్తున్నారని, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారని అన్నారు. జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్నపుడే కృష్ణ జలాలపై గెజిట్ నోటిఫై వచ్చిందని, వారం రోజులు అవుతున్నా దీనిపై కేంద్రంతో ఒక్క మాట మాట్లాడలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్న చేతులు కట్టుకుని చూర్చున్నారని మండిపడ్డారు. కృష్ణా జలాల విషయంపై కేంద్రానికి ఎలాంటి లేఖ రాయలేదన్నారు. 


ప్రతిపక్షాల మీద నోర్లు వేసుకుని ఎగబడే వైసీపీ ఎంపీలు ఢిల్లీలో ఏమి చేస్తున్నారని కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. ఢిల్లీలో ప్రధాని వద్దకు వెళ్లి ఏపీకి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడలేదని మండిపడ్డారు. స్వప్రయోజనాలు తప్ప, ప్రజా ప్రయోజనాలు వైసీపీ ఎంపీలకు పట్టవని విమర్శించారు. కృ‌ష్ణాబోర్డు ఏర్పాటులోను ప్రభుత్వం దారుణంగా ఆలోచిస్తోందన్నారు. కృష్ణ పరివాహకం లేని వైజాగ్‌లో కృష్ణా బోర్డ్ పెడతారా..? అంటూ ప్రశ్నించారు. నార్త్ కోస్ట్ సీఈ కార్యాలయంలో ఒక ఫ్లోర్ కేటాయించామని కృష్ణాబోర్డు చైర్మన్‌కు శశిభూషన్ కుమార్ లేఖ రాశారని, అసలు కృష్ణా బోర్డుకు, వైజాగ్‌కు సంబంధం ఉందా అని ఆయన ప్రశ్నించారు. 


కృష్ణా పరివాహకం ఉన్న విజయవాడ, కర్నూలు ఏర్పాటు చేయకుండా వైజాగ్‌లో ఏర్పాటు చేస్తామనడం జగన్ పిచ్చి చేష్టలకు నిదర్శనమన్నారు. కర్నూలు బోర్డు ఏర్పాటుకు జగన్‌కు మనసు రాలేదా అంటూ ప్రశ్నించారు. కావాలనే జగన్ మోహన్ రెడ్డి రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ పాలనతో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. దీనిపై ఉద్యమం చేయబోతున్నట్లు ప్రకటించారు. కృష్ణా జలాల్లో రాయలసీమ హక్కులను పరిరక్షించడంలో జగన్ విఫలమవుతున్నారని, కేసుల కోసం కేంద్రంతో లాలూచి పడుతున్నారని విమర్శించారు. ఫలితంగా రాయలసీమ తీవ్రంగా నష్టపోతోందని, దీనిపై పోరాటం చేస్తామన్నారు. 


జగన్ లాంటి అసమర్థుడు.. రాష్ట్రానికి అవసరమా? అని ప్రశ్నించారు. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర, రాయలసీమ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ కృష్ణ జలాలు తరలిస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి తన స్వలాభం చూసుకుంటున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ నీటి హక్కుల రక్షణ, రాయలసీమ హక్కుల పరిరక్షణలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని అన్నారు. రాష్ట్రానికి రావల్సిన నీటిపై 1976 కృష్ణా ట్రిబ్యునల్ పంపకాలు చేసిందని, ఆ హక్కులను కొనసాగిస్తూనే బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏపీ వాటను పెంచుతూ ఆమోదం తెలిపిందన్నారు. 


అయితే తాజాగా కృష్ణా జలాల పంపిణీపై పున:సమీక్ష చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏపీ ప్రయోజనాలకు అశనిపాతం లాంటదని వ్యాఖ్యానించారు. దీనిపై సోమవారం జగన్ మోహన్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారని, కృష్ణా జలాల పంపిణీపై కేంద్రానికి, ప్రధానికి, మంత్రులకు లేఖ రాస్తానని చెప్పిన జగన్ ఇప్పటి వరకు ఆ పని చేయలేదన్నారు. వారం రోజులు గడిచినా కేంద్రానికి రాసిన లేఖపై జగన్‌కు సంతకం పెట్టే సమయం లేదా అంటూ నిలదీశారు. రాయలసీమకు అన్యాయం చేస్తున్న జగన్‌కు ప్రజలు గుణపాఠం చెప్పే సమయం దగ్గరలోనే ఉందన్నారు.