హైదరాబాద్: ఆసరా పింఛన్ లబ్దిదారులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఏపీ తరహాలోనే తెలంగాణలో ఆసరా పింఛన్లను పెంచనున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో అందిస్తున్న రూ.2016 పింఛన్లను రూ.5000 పెంచుతామని ఆదివారం స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటన సందర్భంగా కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే పెన్షన్ ను ఒకటేసారి రూ.5 వేలకు పెంచుతామని ప్రజలను తాము మోసం చేయడం లేదన్నారు. 
 
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెన్షన్ ను రూ.2000 నుంచి ప్రతి ఏడాది రూ.250 చొప్పున  పెంచుతూ రూ.3000 చేసి అక్కడ విజయవంతంగా కొనసాగిస్తున్నారని కేసీఆర్ గుర్తుచేశారు. రాష్ట్ర ఖజానాపై భారం పడకుండా చూసేందుకు తెలంగాణలో సైతం ప్రతి ఏడాది కొంతమేర పింఛన్ సాయాన్ని పెంచుకుంటూ పోతామని స్పష్టం చేశారు. 


కేసీఆర్ మాట్లాడుతూ.. ఆసరా పింఛన్ స్కీమ్ అని, మొదటగా రూ.1000 చేశాం. అదే విధంగా పెంచుతూ కంటిన్యూ చేస్తున్నాం. ఆసరా పింఛన్ ను రూ.2016 నుంచి రూ.5 వేలకు పెంచుతున్నాం. అయితే ఒకటేసారి రూ.5 వేలకు పెంచుతామని చెప్పడం లేదు. అధికారంలోకి వచ్చిన తరువాత తొలి ఏడాది అంటే వచ్చే మార్చి తరువాత రూ.3000 కు పెంచుతాం. అదే విధంగా ప్రతి ఏడాది రూ.500 పెంచుకుంటూ ఐదో ఏడాదికి పింఛన్ ను రూ.5000 చేస్తామని వివరించారు. ప్రభుత్వం మీద ఒకటేసారి ఆర్థిక భారం పడకుండా పెన్షనర్లకు సైతం సాయం పెంచుతూ పోతామన్నారు.


పొరుగు రాష్ట్రం ఏపీలో జగన్ ప్రభుత్వం రూ.2 వేల నుంచి పింఛన్ ను రూ.3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏడాది రూ.250 పెంచుతూ చివరికి పింఛన్ మొత్తాన్ని మూడు వేలు చేస్తామని చెప్పి విజయవంతంగా అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. తెలంగాణలో అయితే ఏడాదికి రూ.500 మేర ఆసరా పింఛన్ పెరుగుతుందన్నారు. 


దివ్యాంగులకు శుభవార్త..
దివ్యాంగుల పెన్ష‌న్‌ను ఇటీవ‌ల రూ. 4 వేలు చేసినట్లు కేసీఆర్ గుర్తుచేశారు. దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ మొత్తాన్ని రూ.6 వేల రూపాయాల‌కు తీసుకెళ్తాం అన్నారు. రాష్ట్రంలో 5 ల‌క్ష‌ల 35 వేల కుటుంబాల్లో దివ్యాంగులు ఉన్నారని, వారికి సైతం మార్చి త‌ర్వాత రూ. 5 వేల‌కు చేస్తాం అన్నారు. . ప్ర‌తి సంవ‌త్స‌రం 250 పెంచుతూ, చివరగా ఐదో సంవ‌త్స‌రం రూ. 6 వేలు పింఛన్ అందిస్తామని కేసీఆర్ కీలక ప్రకటన చేశారు.


రెండుసార్లు విజయం సాధించి అధికారం చేపట్టిన కేసీఆర్ హ్యాట్రిక్‌ లక్ష్యంగా బీఆర్ఎస్ సంక్షేమ మేనిఫెస్టోను రూపొందించారు. ప్రజలందరికీ ఐదు లక్షల కేసీఆర్ బీమా కల్పిస్తామని ప్రకటించారు.  వచ్చే ఏప్రిల్ నుంచి తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద సన్న బియ్యం ఇస్తాం.  ప్రస్తుతం ఎకరానికి అందిస్తున్న రూ.10 వేల రైతు బంధు సాయాన్ని మొదట రూ.12 వేలకు పెంచి, ఆపై ఏడాకి వెయ్యి చొప్పును పెంచుతూ రూ.16 వేలకు రైతు బంధు సాయం అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. మహిళలకు సౌభాగ్య లక్ష్మి  పేరుతో అర్హులైన మహిళలకు నెలకు మూడు వేలభృతి ఇవ్వాలని నిర్ణయించారు. అర్హులైన ప్రజలకు నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్‌ ఇస్తామన్నారు. అక్రిడేటెడ్‌ జర్నలిస్టులకు సైతం నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్ అందించాలని ప్రకటించారు.