Kakinada News : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన మాజీ కారు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు ఆరోగ్యశాఖలో ఉద్యోగం ఇస్తూ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా నియామక పత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో దారుణ హత్యకు గురైన సుబ్రహ్మణ్యం కుటుంబానికి తగిన న్యాయం చేయాలని, నిందితుడు అనంతబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు, పౌరహక్కుల సంఘాలు పెద్దఎత్తున నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఘటన జరిగిన మూడో రోజునే కాకినాడ పోలీసులు ఎమ్మెల్సీ అనంతబాబును అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ మరుసటి రోజునే రిమాండ్ కు పంపారు. ప్రస్తుతం ఎమ్మెల్యే రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు.
ఇటీవల కాకినాడలో జరిగిన సంఘటనలో మృతి చెందిన వీధి సుబ్రమణ్యం భార్య వీధి అపర్ణ కు ఎస్సీ, ఎస్టీ (పీఓఏ) చట్టం-1989 ప్రకారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం కల్పించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా సోమవారం కలెక్టరేట్ లో జరిగిన స్పందన కార్యక్రమంలో అపర్ణకు అలాట్ మెంట్ ఉత్తర్వులను అందజేశారు. ఆమె అర్హత ధ్రువపత్రాలను పరిశీలించి, నియామక ఉత్తర్వులు జారీ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య ఆధికారికి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
అపర్ణకు ఆరోగ్యశాఖలో ఉద్యోగం
ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ కారు డ్రైవరు వీధి సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఆదుకోవాలని పెద్దఎత్తున డిమాండ్ వినిపించింది. అప్పట్లో పోలీసులు, జిల్లా అధికారులు ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశాఖలో ఉద్యోగిగా నియమకాన్ని ఇస్తూ జిల్లా కలెక్టరు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆరోగ్యశాఖలో సుబ్రహ్మణ్యం భార్యకు ఉద్యోగం వచ్చింది. కాకినాడ డీఎంఅండ్ హెచ్వో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా నియామక ఆర్డర్ ఇచ్చినట్లు అపర్ణ తెలిపింది.
ప్రలోభాలకు గురించేందుకు ప్రయత్నాలు!
ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ కారు డ్రైవరు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితునిగా రిమాండ్ అనుభవిస్తున్న ఎమ్మెల్సీ అనంతరబాబు అనుచరులు సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ప్రలోభాలతో లొంగదీసుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారని, కేసు మాఫీ చేసేందుకు కుట్ర పన్నుతున్నారని పలు ప్రజాదళిత సంఘాలు ఆరోపించాయి. సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యతని వారు తెలిపారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఇంకా అనేక ప్రలోభాలకు గురిచేయాలని చూస్తారని, దీనికి అధికారులు కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. అనంతబాబు రిమాండ్ ను పొడిగించాలని, బెయిల్ పిటీషన్ ను కొట్టివేయాలని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన క్రమంలో బాధితుల ఉన్నచోట రంపచోడవరం ఎమ్మెల్యేకు చెందిన కారులో ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరులు చక్కర్లు కొట్టారని న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ఆరోపించారు.