Kakinada News : కాకినాడ జిల్లాలో ఓ ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టలో అపశృతి చోటుచేసుకుంది. కప్పీ తాడు తెగిపోవడంతో ఒక్కసారి ధ్వజస్తంభం భక్తులపై కూలిపోయింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామంలో శ్రీ మీనాక్షి సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర విచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముమ్మిడివరం, యానం ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్, గొల్లపల్లి అశోక్ పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకుంది.



తాడు తెగిపోయి కూలిన ధ్వజస్తంభం 


నీలపల్లి నీలకంటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట సందర్భంగా ధ్వజస్తంభం పైకి ఎత్తుతుండగా దానిని ముట్టుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు పోటీ పడ్డారు. దీంతో తాడు తెగిపోయి స్తంభం ఒక పక్కకి కూలిపోయింది. ఈ నేపథ్యంలో ఒక మహిళతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఆ ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన యానాం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆలయ ప్రతిష్ట కార్యక్రమం జరిపించారు. స్వామిజీ అనుగ్రహ భాషణం చేశారు. 


పిడుగురాళ్లలో ఇలాంటి ఘటనే


గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం పందిటివారి పాలెంలోని రామాలయంలో ధ్వజస్తంభం ఏర్పాటులో అపశ్రుతి చోటు చేసుకుంది. రెండు క్రేన్ల సాయంతో ధ్వజస్తంభం నిలబెడుతున్నప్పుడు పైభాగం కొంత విరిగి కింద పడిపోయింది. ఫిబ్రవరి నెలలో ఈ ఘటన జరిగింది. పిడుగురాళ్ల మండలం పందిటివారి పాలెంలో పురాతన రామాలయంలో పునరుద్ధరణ పనులు చేపట్టారు. రామాలయం ఎదుట 1963లో భారీ ధ్వజస్తంభాన్ని ఏర్పాటుచేశారు. 44 అడుగుల ఎత్తుతో 40 టన్నుల బరువుండే రాతి ధ్వజ స్తంభాన్ని ప్రతిష్టించారు. గుత్తికొండ బిలం కొండల్లో ఏకశిలా నుంచి భారీ ధ్వజస్తంభాన్ని తొలిచి ఈ ఆలయంలో ప్రతిష్టించారు. 


అయితే ఇటీవల ఆలయ కమిటీ గుడిని పునర్ నిర్మించాలని నిర్ణయించింది. పురాతన ధ్వజ స్తంభాన్ని కొద్దిగా పక్కకి జరపాలన్నారు. ధ్వజస్తంభం భారీగా ఉండటంతో క్రేన్‌ల సాయంతో పని పూర్తి చేయాలనుకున్నారు. విజయవాడకు చెందిన క్రేన్ ఆపరేటర్లతో ధ్వజ స్తంభాన్ని పక్కకు జరిపేందుకు సిద్ధం అయ్యారు. రెండు భారీ క్రేన్‌లతో ఇంజనీర్ల సలహాతో ధ్వజ స్తంభాన్ని పక్కకి జరిపే ప్రయత్నం చేశారు. స్తంభాన్ని భూమిలో నుంచి పైకి తీసి కొంచెం పైకి ఎత్తగానే ఒక్కసారిగా ధ్వజ స్తంభంలోని రెండు ముక్కలైపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.