Kakinada News : కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో ఘర్షణ చోటుచేసుకుంది. ఏలేశ్వరంలో చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలలో టీడీపీ నేతలు వరుపుల రాజా వర్గీయులు పైల బోస్ వర్గీయులు మధ్య వాగ్వాదం తలెత్తింది. ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలోని స్థానిక బాలాజీ చౌక్ సెంటర్లో టీడీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగాయి. చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకునేందుకు వరుపుల రాజా వర్గీయులు బాలాజీచౌక్ సెంటర్ కు చేరుకున్నారు. ఎంతో కాలంగా పార్టీ జెండా మోసుకుని వచ్చామని ఇప్పటికిప్పుడు పార్టీ శ్రేణులకు తెలియజేయకుండా సొంత నిర్ణయాలతో  చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు చేయడం పట్ల పైల బోస్ వర్గీయులు వాగ్వాదానికి దిగారు. దీంతో వరుపుల రాజా వర్గీయులు పుట్టినరోజు వేడుకలు నిర్వహించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం పైలబోసు వర్గీయులు సెంటర్లో పుట్టినరోజు వేడుకలను నిర్వహించి ర్యాలీని చేపట్టారు. ఈ ఘర్షణలో రాజా వర్గీయుడికి గాయమైంది.  


తిరుమలలో ప్రత్యేక పూజలు 


టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకుని తిరుమలలో నారా - నందమూరి అభిమానుల ప్రత్యేక పూజలు చేశారు. నందమూరి - నారా కుటుంబంలో ఎవరి పుట్టినరోజు అయినా ఇరు కుటుంబాల అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడం అనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే ఎన్టీఆర్‌కి వీరాభిమాని అయిన ఎన్టీఆర్‌ రాజు (టీటీడీ ఎక్స్‌ బోర్డ్‌ మెంబర్‌) కుటుంబ సభ్యులు,  తెదేపా రాష్ట్ర మీడియా కో ఆర్డినేటర్‌ శ్రీధర్‌ వర్మ, నందమూరి - నారా అభిమానులు, టీడీపీ శ్రేణులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం అఖిలాండం దగ్గర 774 కొబ్బరికాయలు కొట్టి, 7 కేజీల 40 గ్రాముల కర్పూరాన్ని వెలిగించి చంద్రబాబుకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలని ప్రార్ధించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి సుపరిపాలన అందించే అవకాశాన్ని ప్రసాదించాలని శ్రీనివాసుడిని వేడుకున్నారు. స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా చంద్రబాబుపై ఉండాలని ఎన్టీఆర్‌ రాజు, శ్రీధర్‌ వర్మ, భాస్కర్‌ వర్మ తదితరులు స్వామిని ప్రార్థించారు. చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. 


చంద్రబాబుకు విజయసాయి రెడ్డి విషెస్


వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పెట్టిన ఓ ట్వీట్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అదెదో పెద్ద విషయం కూడా కాదు. కేవలం పుట్టిన రోజులు శుభాకాంక్షల ట్వీటే. అది కూడా ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుకు పుట్టిన రోజులు శుభాకాంక్షలు చెప్పారు.  టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడుకి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ విజయ్ సాయిరెడ్డి పెట్టిన ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతోంది. గతంలో ఆయన పెట్టిన ట్వీట్‌లను వెలికి తీసి మరీ మీరు మారిపోయార్‌ సార్ అంటున్నారు నెటిజన్లు. గతంలో చంద్రబాబుకు పుట్టిన రోజుల సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన విజయసాయిరెడ్డి వివాదాస్పద భాషను వాడారు. 2021 ఏప్రిల్‌ 20న చేసిన ట్వీట్‌ కూడా వైరల్‌గా మారుతోంది.