Kakinada Tiger : కాకినాడ జిల్లా వాసులకు పెద్దపులి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే ఇప్పుడు మరో సమస్య వచ్చింది. అదిగో పులి ఇదిగో పులి అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. పెద్ద పులి ఓ వాగులోని బురద ఊబిలో చిక్కుకుపోయిందంటూ స్థానికంగా పుకార్లు మొదలయ్యాయి. దీంతో ఎస్. పైడిపాల గ్రామ శివారు ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతంలోకి గ్రామస్తులు, యువకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న అటవీ అధికారులు, పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతూ అక్కడికి చేరుకున్నారు. సుమారు 5 కిలోమీటర్లు దూరం వరకు అందరూ కలిసి నడుచుకుంటూ దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. ఎంత దూరం వెళ్లినా పులి జాడ కనిపించకపోవడంతో ఇదంతా కేవలం పుకార్లు అని అధికారులు స్పష్టం చేయడంతో అంతా వెనుతిరిగారు.
పుకార్లు నమ్మొద్దు
గురువారం సాయంత్రం ఎస్. పైడిపాల శివారులోని దట్టమైన అటవీ ప్రాంతంలో పులి ఊబిలో చిక్కుకుపోయిందని వచ్చిన పుకార్లు అవాస్తవమని అటవీ శాఖ అధికారులు, పోలీసులు స్పష్టం చేశారు. ఎవ్వరూ తొందరపడి తోటలు, అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని సూచించారు. పులి ఈ పరిసర ప్రాంతాల్లోని సంచరిస్తున్న నేపథ్యంలో చాలా ప్రమాదమని హెచ్చరించారు.
ఎస్.పైడిపాలలో పశువుల మందపై దాడి
నెల రోజుల పాటు ప్రత్తిపాడు, శంఖవరం, ఏలేశ్వరం మండలాల పరిధిలోని దాడులు చేసిన పెద్ద పులి రౌతులపూడి మండలం ఎస్. పైడిపాల గ్రామ పరిధిలోనే సరుగుడు, జామాయిలు తోటల్లో పశువులపై పంజా విసిరింది. ప్రస్తుతం ఎస్. పైడి పాల గ్రామ పరిధిలోని దట్టమైన తోటల్లో పాగా వేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. శంఖవరం మండల పరిధిలోని తాడువాయి, పెద్దమల్లపురం పరిసర ప్రాంతాల్లో ఆవులపై దాడి చేసిన తరువాత పులి రిజర్వు ఫారెస్ట్ లోకి వెళ్లిపోయిందని అధికారులు చెప్పారు. అయితే సమీప మండలమైన రౌతులపూడి మండల పరిధిలోని ఎస్ పైడిపాల గ్రామ పరిధిలోకి వచ్చే పశువులపై దాడి చేసి ఒక ఆవు కబళించింది. తాజా పులి కదలికలను బట్టి పులి వచ్చిన మార్గాన్నే తిరిగి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తుందని దానికి సమీపంలో కనిపించిన పశువులపై దాడి చేసిందని అధికారులు చెబుతున్నారు.
ఈ ప్రాంతంలోనే పులి
పులి భయంటో రిజర్వ్ ఫారెస్ట్ కు అత్యంత సమీపంలో ఉన్నటువంటి తోటల్లో పశువులు ఉంచి స్థానిక రైతులు వాటిని సంరక్షించుకుంటున్నారు. నిన్న సాయంత్రం నాలుగు గంటల సమయంలో మేత మేస్తున్న పశువుల మందపై దాడి చేసి ఒక ఆవుని తీవ్రంగా గాయపరిచింది. ఆవు తీవ్రగాయాలతో తప్పించుకొని మకాం వైపు పరుగులు తీయడంతో అది చూసిన పశువుల కాపరులు రైతులు తీవ్ర ఆందోళన చెందారు. ఆవు శరీరంపై ఉన్న గాయాలను పరిశీలించి పెద్దపులి పని అని భావించి అధికారులకు సమాచారం అందించారు. ఇది ఇలా ఉంటే అందులోని ఒక ఆవును మాత్రం వేరుగా దాడి చేసిన పెద్దపులి చివరకు దానిని చంపి తినేసింది. అయితే పశువుల కాపర్లు ఆవు కనిపించకపోవడంతో రాత్రి భయంతో దాన్ని వెతికేందుకు ప్రయత్నించలేదు. సమీపంలోని సరుగుడు తోటల్లో తిని వదిలేసిన కళేబరం పశువుల కాపరులు కంట పడింది. దీంతో అధికారులు స్థానికులు పులి ఈ ప్రాంతంలోనే సంచరిస్తుందని పాద ముద్రల ద్వారా కనుగొన్నారు.