చిత్తూరు నగరంలో గురువారం అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. చిత్తూరు మాజీ మేయర్ పైకి పోలీసులు జీపు దూసుకెళ్లడంతో ఆమెకు తీవ్ర గాయాలైయ్యాయి. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స ఇప్పిస్తున్నారు. చిత్తూరులో రాత్రి 11 సమయంలో స్థానిక సంతపేటలోని మాజీ మేయర్, టీడీపీ నగర అధ్యక్షురాలు అయిన కటారీ హేమలతకు అనుచరుడు అయిన పూర్ణ ఇంటికి పోలీసులు వచ్చారు. అతని ఇంట్లో గంజాయి ఉందంటూ తనిఖీలు చేశారు. అయితే, పోలీసులు తప్పుడు సమచారంతో తన ఇంటికి వచ్చారని పూర్ణ ఆందోళనకు దిగాడు. ఆ విషయం తెలుసుకున్న మాజీ మేయర్ హేమలత తన అనుచరులతో కలిసి పోలీసు జీపు వెనక కూర్చొని నిరసన తెలిపారు. అయినా సరే జీపును రివర్స్ చేసి పోనివ్వమని సీఐ డ్రైవర్‌తో చెప్పారు. దీంతో వాహనం హేమలత కాళ్లపై నుంచి వెళ్లి పోయిందని ఆమెతో పాటు అనుచరులు ఆరోపణలు చేశారు.
వెంటనే ఆమె అనుచరులు గాయపడిన హేమలతను ఆసుపత్రికి తరలించారు. తన అత్తమామలైన దివంగత మేయర్ కఠారి అనురాధ, మోహన్ హత్య కేసులో సాక్షులను బెదిరిస్తున్నారని హేమలత సాయంత్రం ఏఎస్పీ జగదీష్ కు ఫిర్యాదు చేశారు. వినతి పత్రం కూడా ఇచ్చారు. ఆ వెంటనే మీడియాతో మాట్లాడారు. అది జరిగిన కొద్ది గంటల్లోనే ఇంట్లో గంజాయి పేరుతో పోలీసులు వచ్చారని హేమలత అనుచరులు ఆరోపిస్తున్నారు.
గంజాయి ఇంట్లో పెట్టబోయారని ఆరోపణ
ఆ హత్య కేసులో మాజీ మేయర్ హేమలత అనుచరుడు ప్రసన్న సాక్షిగా ఉన్నాడు. ఈ ప్రసన్న తమ్ముడే పూర్ణ. ఈ పూర్ణ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాడంటూ చిత్తూరు టూ టౌన్ పోలీసులు రాత్రి 8 గంటలకు స్టేషన్ కు తీసుకు వెళ్లారు. అయితే, మరోవైపు పోలీసులు తమ ఇంటికి వచ్చి ఇంట్లో గంజాయి పెట్టేందుకు ప్రయత్నించారని, తాము అడ్డుకున్నామని పూర్ణ తల్లి, వదిన చెబుతున్నారు. దీంతో ఓబసపల్లెలో తన మరో ఇంట్లో ఒక గంజాయి బస్తా పెట్టారని ఆరోపిస్తున్నారు.
హేమలత, పలువురు టీడీపీ నేతలు అక్కడికి వచ్చి ఆ బస్తాల్లో ఏముందో చూపించాలని పోలీసులను డిమాండ్ చేయగా, కుదరదంటూ పూర్ణను జీపులోకి ఎక్కించారు. దీంతో పోలీసుల తీరుపై హేమలత సహా ఆమె అనుచరులు జీపు వెనక వైపునకు వెళ్లి కూర్చున్నారు. జీపును రివర్స్ చేసే క్రమంలో హేమలత కాళ్లపై నుంచి వెళ్ళిపోయిందని వారు చెబుతున్నారు. రెండు కాళ్ల ఎముకల్లో స్వల్పంగా పగుళ్లు వచ్చినట్లు డాక్టర్లు చెప్పారు.
అన్నీ అబద్ధాలే - పోలీసులు
పూర్ణ ఇంట్లో గంజాయి దొరికిన మాట నిజమేనని చిత్తూరు టూ టౌన్ సీఐ చెప్పారు. టీడీపీ నేతలకు జీపు తగలకపోయినా ఎక్కించామని తమను తప్పుగా చూపుతున్నారని పోలీసులు వివరణ ఇచ్చారు.
అయితే, ఈ అంశంపై స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బీఎన్ రాజసింహులు స్పందించారు. దివంగత మేయర్ అనురాధ, మోహన్ హత్య కేసు నుంచి ఫోకస్ తప్పించేందుకే పోలీసులు ఈ కుట్ర పన్నారని అన్నారు. అందులో భాగంగానే గంజాయి అక్రమ రవాణా అంటూ కొత్త నాటకానికి తెర తీశారని ఆరోపించారు. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆరాతీశారు.