Kadiri: కరవు(Drought) నెలలో ఓ బావి శతాబ్దాలుగా నీటిని ప్రజలకు అందిస్తోంది. అనంతపురం జిల్లా కదిరి(Kadiri)లో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నరసింహస్వామి దేవాలయానికి(Laxmi Narasimha Swami Temple) సమీపంలో ఉంది ఈ పాల బావి. శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ బావి(Well)లో నేటికీ నీళ్లు ఉన్నాయి. ఇది చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురికాక తప్పదు. అనేక బావులు చరిత్ర కాలగర్భంలో కలిసిపోయాయి. మరికొన్ని శిథిలావస్థకు చేరుకుని పూడికతో మునిగిపోయాయి. కానీ స్వామి సన్నిధిలో ఉన్న ఈ బావి ఇప్పటికీ ప్రజలకు సేవలు అందిస్తూనే ఉంది. ఈ బావికి సంబంధించిన అనేక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
పాల లాగ తేటగా నీళ్లు
శతాబ్దాల క్రితం కదిరి నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా కాలినడకన వచ్చే వాళ్లు. దీంతో చాలా మంది భక్తులు(Devotees) అలసటకు గురై నీటి కోసం దిక్కులు చూసే పరిస్థితి ఉండేది. అసలే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం. దీంతో బావుల మీదే ఆధారపడే రోజులు కూడా కాబట్టి చెన్నమ్మ అనే భక్తురాలు భక్తుల సౌకర్యార్థం బావిని తవ్వించేందుకు ప్రయత్నం మొదలు పెట్టింది. బావి తవ్వుతుండగానే బావిలో నుంచి ఓ అదృశ్యవాణి వినిపించింది. ఈ బావిని భక్తుల అవసరాల కోసం తవ్వుతున్నారు కనుక ఈ బావిలో ఎప్పటికీ మంచినీరు ఉంటుందని, పాల లాగ తేటగా నీళ్లు ఉబికి వస్తాయని ఆ వాణి సారాంశం. అది మొదలు నేటి వరకు బావిలో మంచి నీరు వస్తూనే ఉన్నాయి. దీంతో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు అందరూ బావిలోని నీటితో శుభ్రం చేసుకుని స్వామివారి దర్శనానికి వెళ్లేవారు.
స్వామి లీలగా భక్తులు విశ్వాసం
స్వామివారి ఆలయం సమీపంలో నిర్మించిన ఈ బావికి పాలబావి(Palabaavi)గా పిలిచేవారు. కాలానుగుణంగా పాలబావి నిరాదరణకు గురైందని అని చెప్పవచ్చు. అయినప్పటికీ నీటి లభ్యత మాత్రం తగ్గలేదు. శతాబ్దాల కాలం నుంచి తీవ్ర వర్షాభావ పరిస్థితులు వచ్చాయి. కరువు కాటకాలతో రాయలసీమ(Rayalaseema) అతలాకుతలమైంది. అయినప్పటికీ బావిలో మాత్రం నీటి చెమ్మ తగ్గలేదు. కరువు కాటకాల సమయంలో ఎంతోమంది నీటి అవసరాలు తీర్చింది పాల బావి. ఇది అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయమే అయినప్పటికీ నేటికి కూడా మనం ఆ బావిలో నీటిని చూడవచ్చు. ఇదంతా స్వామి వారి లీల అని భక్తుల విశ్వాసం. ఇప్పటికీ పాలబావిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి అనేక మంది తమ పిల్లలతో వస్తూనే ఉంటారు.