YS Bhaskar Reddy Arrest : వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని ఇవాళ ఉదయం సీబీఐ అరెస్ట్ చేసింది. భాస్కర్ రెడ్డికి అరెస్టుకు నిరసనగా వైసీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. పులివెందులలో వ్యాపారస్తులు షాపులు ముసివేయగా, వైసీపీ కార్యకర్తలు నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు. వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ కు నిరసనగా కడప నగరంలోని వైఎస్సార్ సర్కిల్ లో మేయర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ నిరసనలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి.  సీబీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ..  వివేకా హత్య కేసులో సీబీఐ ఏకపక్షంగా విచారణ చేస్తుందని ఆరోపించారు. కావాలనే ఎల్లో మీడియా బురద జల్లే ప్రయత్నం చేస్తోందన్నారు. వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్  దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. వైసీపీ శ్రేణులు  భాస్కర్ రెడ్డి అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాయన్నారు. సీబీఐ ఏకపక్షంగా కేసు విచారణ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసన ప్రదర్శనలు చేస్తుందన్నారు. సీబీఐ నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని కోరారు.  






సీబీఐకి వ్యతిరేకంగా నిరసనలు 


వైఎస్ భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌ను నిరసిస్తూ పులివెందులలో వైసీపీ శ్రేణులు శాంతియూత ర్యాలీ నిర్వహించారు. సీబీఐ ఏకపక్ష వ్యవహరించిందని నిరసన వ్యక్తం చేశారు. దుకాణాలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు. రాజంపేటలో భాస్కర్ రెడ్డి అరెస్ట్ కు నిరసనగా జెడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి అధ్వర్యంలో నిరసన ర్యాలీ చేశారు.   






పులివెందులలో హైటెన్షన్ 


వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డిని (YS Bhaskar Reddy Arrest) సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలోని (Pulivendula News) భాస్కర్ రెడ్డి ఇంటికి ఆదివారం తెల్లవారుజామునే (ఏప్రిల్ 16) రెండు వాహనాల్లో సీబీఐ అధికారులు 10 మందికి పైగా వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. భాస్కర్ రెడ్డి కుమారుడు ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. తాజాగా అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడం చర్చనీయాంశం అయింది. దీంతో ప్రస్తుతం పులివెందులలో హైటెన్షన్ నెలకొంది. తొలుత వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ను విచారిస్తున్న సీబీఐ అధికారులు.. అనంతరం అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు మెమోను సీబీఐ అధికారులు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు, వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున భాస్కర్ రెడ్డి నివాసం వద్దకు భారీగా చేరుకున్నారు.