ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై, ఆయన కుటుంబంపై అసెంబ్లీ సాక్షిగా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని తన భార్య భువనేశ్వరిపై సైతం తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో చంద్రబాబు బాధను తట్టుకోలేక ప్రెస్ మీట్‌లో కన్నీళ్లు పెట్టుకున్నారు. అది మొదలుకుని టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతు పెరుగుతోంది. చంద్రబాబుపై అభిమానంతో ఇటీవల ఓ కానిస్టేబుల్ రాజీనామా చేయడం తెలిసిందే. తాజాగా మరొకరు ఉద్యోగానికి రాజీనామా చేశారు.
చంద్రబాబుకు అవమానం జరగడంపై కలతచెందిన కడప జిల్లాకు చెందిన ఓ మహిళ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం వై.కోటకు చెందిన దుద్యాల అనితాదీప్తి మెప్మాలో టౌన్ మిషన్ కో ఆర్డినేటర్ జాబ్‌కు రిజైన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వేకోడూరులో ఆదివారం దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం తన రాజీనామా పత్రాన్ని ఉన్నతాధికారులకు అందజేయనున్నానని తెలిపారు.
Also Read: Prakasam: చంద్రబాబును అవమానించారని కానిస్టేబుల్ రాజీనామా
టీడీపీ నేత, శాప్ మాజీ డైరెక్టర్ జయచంద్ర కుమార్తెనే ఈ అనితాదీప్తి. 2014లో ఎర్రగుంట్లలో మెప్మా టౌన్ మిషన్ కో ఆర్డినేటర్‌గా చేరారు. ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబుకు అవమానం జరగడాన్ని జీర్ణించుకోలేక, అందుకు నిరసనగా ఉద్యగానికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. గత ఏడేళ్లుగా ఉద్యోగం చేస్తున్నానని.. కానీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు తనను బాధించాయన్నారు. 2024లో చంద్రబాబు తిరిగి సీఎం అయ్యేందుకు తనవంతుగా పనిచేస్తానన్నారు. ఆయన తిరిగి సీఎం అయ్యాక ఉద్యోగంలో మళ్లీ చేరుతానని వ్యాఖ్యానించారు.
ఇటీవల కానిస్టేబుల్ రాజీనామా
ప్రకాశం జిల్లాకు చెందిన విజయ్ కృష్ణ అనే కానిస్టేబుల్ 1998 బ్యాచ్.. రాతపరీక్షలోనూ టాపర్‌గా నిలిచారు. 2002 ఒంగోలు పీటీసీలో బెస్ట్ షూటర్‌గా నిలిచారు. 2003లో కూడా బెస్ట్ షూటర్ గా అవార్డు పొందారు. చంద్రబాబు హయాంలోనే ఆయనకు ఉద్యోగం వచ్చిందని, అలాంటి వ్యక్తికి అసెంబ్లీ సాక్షిగా అవమానం జరగడాన్ని తట్టుకోలేకపోయారు.
చంద్రబాబుకు మద్దతుగా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. నైతిక విలువలు, నిబద్దత కోల్పోయిన ఈ ప్రభుత్వం మరింత దారుణంగా ప్రవర్తిస్తుందన్నారు. తాను ఎంతో నిజాయితీగా ఉద్యోగం చేశానని, ఎక్కడా చేయి చాచలేదని ఏపీలో పరిస్థితులు పోలీసులకు తెలునంటూ ఆయన మాట్లాడిన వీడియో వైరల్ అయింది.
Also Read: కమలాపురం వద్ద పాపాగ్ని నదిపై కూలిన వంతెన... కడప-అనంతపురం మధ్య రాకపోకలు బంద్