KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. మెగాస్టార్ గురించి చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 'పిచ్చుకపై బ్రహ్మాస్త్రం' అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై కేఏ పాల్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో స్పందించారు. చిరంజీవి జనసేన పార్టీలో చేరతారని తాను ముందే చెప్పానని కేఏ పాల్ అన్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇన్‌కం ట్యాక్స్ ఎగ్గొట్టడానికే బీజేపీతో జనసేన పార్టీ పొత్తు అని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. మోదీ, బాబు, కేసీఆర్ కు గుండు గీస్తానని పాల్ అన్నారు.  బీజేపీ-బి పార్టీలను ఓడిస్తానని తెలిపారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ ను ప్రజలను నమ్మొద్దన్నారు. పవన్ కల్యాణ్ ది వారాహి యాత్ర కాదని మోదీ యాత్ర అని కేఏ పాల్ విమర్శించారు. చిరంజీవి కూడా జనసేనలో చేరుతారని లీక్స్ ఇస్తున్నారని విమర్శించారు. సిగ్గున్న వారు ఎవరైనా జనసేన పార్టీలో చేరతారా అని పాల్ ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ విశాఖలో చేస్తున్నది వారాహి యాత్ర కాదని... బీజేపీ కోసమేనని అన్నారు. దీనిపై చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగేంద్ర బాబుతో ఓపెన్ డిబేట్ నిర్వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కేఏ పాల్ సవాల్ విసిరారు.


2024 తర్వాత జనసేన బీజేపీలో విలీనం కావడం ఖాయమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ జోస్యం చెప్పారు. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి 5 వేల కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు గుప్పించారు. ప్రజారాజ్యం టికెట్ కోసం రూ.1500 కోట్లు కలెక్ట్ చేశారని ఆరోపించారు. చిరంజీవిలాంటోళ్లు కేవలం ఐటీ రైడ్స్, ఈడీ రైడ్స్ కు భయపడే బీజేపీకి సరెండర్ అవుతున్నారని విమర్శలు గుప్పించారు.


అసలు చిరంజీవి ఏమన్నారంటే?


''మీలాంటి పెద్దలు ప్రత్యేక హోదా గురించి గానీ, రోడ్ల నిర్మాణం గురించి గానీ, ప్రాజెక్టులు గురించి గానీ, పేద వారికి కడుపు నిండే విషయాల గురించి గానీ, ఉద్యోగ  - ఉపాధి అవకాశాలు కల్పించడం గురించి ఆలోచించాలి. అంతే కానీ... పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి సార్?'' అని 'వాల్తేరు వీరయ్య' రెండొందల రోజుల వేడుకలో చిరంజీవి వ్యాఖ్యానించిన వీడియో సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. దాంతో వైసీపీ నాయకులు ఒక్కొక్కరూ చిరంజీవిపై మాటల దాడి మొదలు పెట్టారు. అసలు... ఆ రోజు జరిగింది ఏమిటి? వేదికపై చిరంజీవి వ్యాఖ్యానించినది ఏమిటి? ఆ మాటలకు ముందు, వెనుక చిరంజీవి చెప్పింది ఏమిటి? అనేది బయటకు రాలేదు. ఈ రోజు ఫుల్‌ వీడియో బయటకు వచ్చింది. 


హీరోల రెమ్యూనరేషన్స్ గురించి పెద్దలు సభలో ఎందుకు?


''ఎన్ని సినిమాలు చేస్తే... అంత మందికి ఉపాధి లభిస్తుంది. కడుపు నిండా తిండి ఉంటుంది. వాళ్ళు హాయిగా ఉంటారు. సినిమాలు ఎక్కువ చేసినా సరే... సినిమా వాళ్ళకు ఎక్కువ రెమ్యూనరేషన్లు ఇస్తున్నా సరే... పార్లమెంటులో, పెద్దల సభలో కూడా మాట్లాడుతున్నారంటే వాళ్ళకు ఏమీ పనీ పాటా లేదా?'' అని చిరంజీవి వ్యాఖ్యానించారు.