Mylavaram Politics: మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టిలో విభేదాలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. తనకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్న వారిని చెడ్డీ గ్యాంగ్, బ్లేడ్ బ్యాచ్ సభ్యులతో పోల్చారు, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్...


మళ్లీ మొదలైందా....


మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్థానిక శాసన సభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేష్ మధ్య విభేదాలు ఇంకా సమసిపోలేదు. చాప కింద నీరులా కొనసాగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే తాజాగా వసంత కృష్ణ ప్రసాద్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనకు వ్యతిరేకంగా పని చేస్తున్న వారిని చెడ్డీ గ్యాంగ్, బ్లేడ్ బ్యాచ్ సభ్యులతో పోల్చారు. 


ఇప్పటికే నియోజకవర్గంలో రెండు గ్రూపులుగా మారిన వేళ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పంచాయితీ చేసినప్పటికి పరిస్థితి మరాలేదని ఈ కామెట్స్ చూస్తేనే అర్థమవుతోంది. 


జగన్ చెప్పినా అంతే ?
ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు తన్నులాటకు దిగటంతో క్యాడర్‌లో గందరగోళం ఏర్పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఇదే నియోజకవర్గంలో సొంత పార్టీకి చెందిన నేతలు గ్రూపులుగా ఏర్పడటం పై జగన్ మోహన్ రెడ్డి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. స్థానిక శాసన సభ్యుడు వసంత కృష్ణప్రసాద్ ఉండగా, అదే నియోజకవర్గంలో ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఏకైక మంత్రిగా ఉన్న జోగి రమేష్ కూడా జోక్యం చేసుకుంటున్నారు. తన పాత నియోజకవర్గం కావటం, తన తండ్రి ఇతర కుటుంబ సభ్యులు సైతం అదే నియోజకవర్గంలో పార్టీ కోసం ఆవిర్బావం నుంచి కష్టపడటంతో జోగి రమేష్ మైలవరం నియోజకవర్గంపై మనస్సు పెట్టుకున్నారు.


అక్కడ జోగి రమేష్ వర్గం ఒకటి ఏర్పడి, స్థానిక శాసన సభ్యుడిగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ కు వ్యతిరేకంగా పని చేయటం ఆరంభించారు. ఇది వసంతకు ఇబ్బందిగా మారింది. ఒకే పార్టీలో ఉండి కూడా స్థానిక శాసన సభ్యుడికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేపట్టటం అదే సమయంలో జోగికి మంత్రి పదవిని కూడా ఇప్పించటంతో వసంత అవమానంగా భావించారు.


పార్టీ పెద్దల వద్ద తెగని పంచాయితీ...


మైలవరంలో మంత్రి జోగి రమేష్, శాసన సభ్యుడు వసంత కృష్ణప్రసాద్ మధ్య విభేదాలపై ఇరువురు నేతలు బాహాటంగానే కామెంట్స్ చేసుకున్నారు. అయితే ఈ వ్యవహరంపై పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పంచాయితీ కూడా చేశారు. అయినా ఇరువురు నేతలు తమ వైఖరిని మార్చుకోలేదు. దీంతో ఈ వ్యవహరాన్ని కృష్ణా, గుంటూరు జిల్లాల కోఆర్డినేటర్‌గా ఉన్న మర్రి రాజశేఖర్ వద్దకు చేర్చారు. అయినా అక్కడ కూడా పంచాయితీ తెగలేదు. చివరకు ముఖ్యమంత్రి జగన్ నేరుగా జోక్యం చేసుకున్నారు. మైలవరంలో నీకేంటి పని అంటూ మంత్రి జోగి రమేష్ ను జగన్ ప్రశ్నించారని, ఎవరి నియోజకవర్గాల్లో వారు పని చేయాలని తెగేసి చెప్పటంతో వ్యవహరం కొలిక్కి వచ్చిందని అంతా భావించారు. అయితే తాజాగా వసంత కృష్ణప్రసాద్ చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం నివురుగప్పిన నిప్పులా ఉందనే అభిప్రాయం క్యాడర్ లో వ్యక్తం అవుతోంది.


వివాదం తెర పడలేదా?


ముఖ్యమంత్రి జోక్యంతో ఈ వివాదం సమసిపోయిందని ఎవరి పని వారు చేసుకుంటామని వసంత గతంలో వెల్లడించారు. అంతే కాదు తాను ఎప్పటికి జగన్ వెంటనే ఉంటానని కూడా క్లారటి ఇచ్చారు. ఇప్పుడు మరోసారి వసంత కృష్ణప్రసాద్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటానికి గల కారణాలు ఎంటి అన్నది ప్రశ్నగా మారింది. ముఖ్యమంత్రి స్థాయిలో సమస్య గురించి చర్చించి, క్లారిటి తీసుకున్న తరువాత కూడా నియోజకవర్గంలో శాసన సభ్యుడిగా ఉన్న వ్యక్తిని టార్గెట్ గా చేసుకొని పార్టి నేతలు, పని చేయటం, వారిని ఉద్దేశించి ఎమ్మెల్యే ఘాటుగా రెస్పాండ్ అవటంతో పార్టీ నేతలకు బుర్ర హీటెక్కిపోతోందని పట్టుకుంటున్నారు.