Jogi Ramesh seeking anticipatory bail  : వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.  ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు  చంద్రబాబు నివాసం పై దాడి కేసులో  పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన పేరు ఉండటంతో  ముందస్తు బెయిల్ కోసం జోగి రమేష్ హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టు చేసే  అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును  జులై 8వ తారీఖున   హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది.                 


2021 సెప్టెంబర్‌లో  జోగి రమేష్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లారు. డెల శివప్రసాద్ వర్ధంతి నాడు అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డిని కించ పరిచారని.. ఆయనతో చంద్రబాబే వ్యాఖ్యలు చేశారని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ జోగి రమేష్ పెద్ద ఎత్తున కార్లతో చంద్రబాబు ఇంటి మీదకు వెళ్లారు.  చంద్రబాబు ఇంటి గేటు దాటి లోపలకు వెళ్లే సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. దాంతో జోగి రమేష్ అక్కడే ధర్నాకు దిగారు. ఆ సమయంలో టీడీపీ నేతలు కూడా రావడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అక్కడకు వచ్చిన బుద్దా వెంకన్న కు స్వల్ప గాయాలయ్యాయి.                                


ప్రతిపక్ష నేత ఇంటిపై ఇలా అధికార పార్టీ నేత దాడికి రావడంతో అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే పోలీసులు ఎవరిపైనా కేసులు పెట్టలేదు. టీడీపీ నేతలపై మాత్రం కేసులు పెట్టారు. అప్పట్లో ఈ విషయాన్ని చంద్రబాబునాయుడు కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లారు . అయినప్పటికీ కేసులు నమోదు చేయలేదు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడం ఆ కేసును రీఓపెన్ చేశారు. ఇందులో నిందితుడిగా జోగి రమేష్ ను చేర్చారు. ఆ ఘటన తర్వాత జోగి  రమేష్ కు మంత్రి పదవి లభించింది. ఇటీవల ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయారు. 


వైసీపీ హయాంలో టీడీపీ నేతల ఇళ్లు, టీడీపీ ఆఫీసులపై జరిగిన దాడి కేసులపై తాజాగా కేసులు పెడుతున్నారు. ఇప్పటికే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఐదుగుర్ని అరెస్టు చేశారు. పలువురు కీలక నేతలకు ఈ దాడిలో ప్రమేయం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. రెండు మూడు రోజుల్లో కొంత మందిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే పట్టాభిరాం ఇంటిపై దాడి చేసిన కేసులోనూ అరెస్టులు జరగనున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులోనూ నిందితుడిగా చేర్చడంతో జోగి రమేష్  ముందస్తు  బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లారు. ఇప్పటికే ఆయన అగ్రిగోల్డ్ స్థలాన్ని కబ్జా చేశారన్న కేసు కూడా నమోదయినట్లుగా తెలుస్తోంది.