JC Prabhakar Reddy behavior: జేసీ ప్రభాకర్ రెడ్డి .. ఈ పేరు గురించి రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఆయన ఒక్క సారే ఎమ్మెల్యే అయ్యారు కానీ.. మళ్లీ మున్సిపల్ వార్డు మెంబర్ గా పోటీ చేసి గెలిచి మున్సిపల్ చైర్మన్ అయ్యారు. ఎందుకంటే ఊరుని అభివృద్ధి చేసుకోవాలని అంటున్నారు. ఆయనకు ఊరు మీద అంతటి ప్రేమ ఉంటుంది. హఠాత్తుగా ఆయన దీక్ష ప్రారంభించారు. కొత్త ఏడాదిలో ఆయన దీక్షచేస్తున్నారంటే అందరూ ఏదో లొల్లి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఆయన దీక్ష ఈ సారి వెరైటీగా ఉంది.
తన ప్రవర్తన గురించి తాడిపత్రిలో అందరూ ఏవోవో అనుకుంటున్నారని.. అందరూ తన కోపాన్నే చూస్తున్నారని కానీ తన లక్ష్యం ఊరుని బాగు చేసుకోవడానికేనని ఆయన చెబుతున్నారు. తాడిపత్రి కోసం ఎన్ని పనులు చేశాను. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా తాను ఎంత నిధులు ఖర్చు చేశాను, ఏ ఏ అభివృద్ధి పనులకు ఎంత వెచ్చించాను అనే వివరాలను ఫ్లెక్సీలో ముద్రించి తన దీక్ష దక్షర ఏర్పాటు చేశారు. గాంధీ బొమ్మ సెంటర్ లో దీక్షా వేదిక ఏర్పాటు చేస్తున్న ఆయన తన మనసులోని అభిప్రాయాలను ప్రజలకు చెప్పారు. తన ప్రవర్తనపై ప్రజల్లో అపోహల ుఉన్నాయని ప్రజల అభిప్రాయం మేరకే తన ప్రవర్తనను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. 2026లో తాడిపత్రిని మరింత అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు. ప్రజలకు ఏమైనా సందేహాలుంటే తనను నేరుగా సంప్రదించేందుకు ఫోన్ ద్వారా కూడా అందుబాటులో ఉంటానని చెబుతున్నారు. వారు అడిగే ప్రతి రూపాయికి లెక్క చెప్తా అని ప్రకటించారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవలి కాలంలో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారన్న అభిప్రాయాలు పట్టణ వాసుల్లో ఉన్నాయి. ఆయన తరచూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తీరుపై ప్రజల్లో చర్చ జరుగుతూండటంతో ఆయన ఇలా తనను సరిదిద్దాలని దీక్ష చేపట్టారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. తాడిపత్రి మున్సిపల్ కు కూడా ఎన్నికలు జరుగుతాయి. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా తన పనితీరును ప్రజల ముందు పెట్టారని.. అంటున్నారు. వివాదాస్పద అంశాల విషయాలనూ మార్చుకుంటానని ఆయన చెప్పడం ఆసక్తికరంగా మారుతోంది.
దేశంలోని అత్యుత్తమ మునిసిపాలిటీల్లో ఒకటిగా తాడిపత్రి గుర్తింపు పొందింది. అయితే అక్కడ రాజకీయాల కారణంగా ఎప్పుడూ తాడిపత్రి అభివృద్ధి గురించి పెద్దగా ప్రచారంలోకి రాదు. ఆ నగరంలో పచ్చనదం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఇంటి ముందు చెట్లు పెంచకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డి అంగీకరించరు. ఆయన సోదరుడు జేసీ దివాకర్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలోనూ ఆయన మున్సిపాలిటీ చైర్మన్ గా పని చేసేవారు. ఊరు విషయంలో ప్రతి విషయాన్ని ఆయన చాలా జాగ్రత్తగా డీల్ చేస్తారు.