Greater Hyderabad District Reorganization: తెలంగాణ రాజధాని భాగ్యనగరం మరో చారిత్రాత్మక మార్పునకు సిద్ధమవుతోంది. కేవలం భౌగోళికంగానే కాకుండా పాలనాపరంగా కూడా హైదరాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పోలీస్ కమిషనరేట్లు, జిల్లాల సరిహద్దులు వేర్వేరుగా ఉండటం వల్ల తలెత్తుతున్న పాలనాపరమైన చిక్కులకు ముగింపు పలకాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించిన కసరత్తు వేగవంతమైంది.
కమిషనరేట్లే జిల్లాలకు ప్రాతిపదిక
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పోలీస్ కమిషనరేట్ల హద్దులు ఒకలా, రెవెన్యూ జిల్లాల హద్దులు మరోలా ఉన్నాయి. దీని వల్ల శాంతిభద్రతల పరిరక్షణలోనూ, రెవెన్యూ సేవల్లోనూ సమన్వయ లోపం ఏర్పడుతోంది. దీనిని అధిగమించడానికి కొత్తగా ఏర్పాటైన ప్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌తోపాటు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిని ప్రాతిపదికగా తీసుకొని జిల్లాల సరిహద్దులను మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయి వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు.
హైదరాబాద్ జిల్లా: కొత్త రూపు
ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ జిల్లా పరిధిలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. నగరం మధ్యలో ఉన్న 16 మండలాల్లో కొన్నింటిని ఇతర జిల్లాల్లోకి మార్చడం ద్వారా పాలనను సులభతరం చేయనున్నారు.
మల్కాజిగిరిలోకి కీలక మండలాలు: సికింద్రాబాద్ పరిధిలోకి తిరుమలగిరి, మారేడ్‌పల్లి మండలాలను మల్కాజిగిరి జిల్లాలోకి చేర్చనున్నారు. బేగంపేట మార్పు; అమీర్‌పేట మండలంలోని కీలకమైన బేగంపేట ప్రాంతం కూడా మల్కాజిగిరిలోకి మార్చాలని చూస్తున్నారు.
దక్షిణ హైదరాబాద్ విస్తరణ: హైదరాబాద్‌జిల్లా సరిహద్దులు శంషాబాద్, రాజేంద్రనగర్ వైపు విస్తరించనున్నాయి. అయితే సదరు మండలాల్లో జీహెచ్‌ఎంసీ పరిధి ఎంత వరకు ఉంటుందో అంత వరకు మాత్రమే హైదరాబాద్ జిల్లాలోకి వస్తుంది.
మేడ్చల్- మల్కాజిగిరి విస్తరణ
- మల్కాజిగిరి జిల్లా ఇప్పుడు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధి ఎంత వరకు ఉందో అంత వరకు విస్తరిస్తారు.
- రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌నగర్, హయత్ నగర్ మండలాలు ఇకపై మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాల్లో కలవనున్నాయి.
- అంటే ఈ లెక్క ప్రకారం ఎల్బీ నగర్, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తిగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోకి రానున్నాయి.
రెండుగా రంగారెడ్డి జిల్లా
పరిపాలన సౌలభ్యం కోసం రంగారెడ్డి జిల్లాను రెండుగా విభజించనున్నారు. ఐటీ హబ్‌లు, భారీ పరిశ్రమలు, గేటెడ్ కమ్యూనిటీలతో ఉన్న ప్రాంతాలను ఒక జిల్లాగా, గ్రామీణ ప్రాంతాలను మరో జిల్లాగా మార్చనున్నారు. సైబర్‌రాబాద్‌పోలీస్ కమిషనరేట్ పరిధి మొత్తాన్ని కలిపి రంగారెడ్డి అర్బన్ జిల్లాగా మార్చనున్నారు. కొత్తగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిని రంగారెడ్డి రూరల్ జిల్లాగా మారుస్తారు. ఇందులో షాద్‌నగర్, శంషాబాద్ రూరల్, చేవెళ్ల, ఆమనగల్లు, మహేశ్వరం వంటి మండలాలు ఉంటాయి.
ఈ భారీ మార్పులకు సంబంధించిన డ్రాఫ్ట్ త్వరలోనే విడుదల కానుంది. 2027లో జనాభా లెక్కల కంటే ముందే ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు సెన్సస్‌జరగనుంది. జనవరి లోపు పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.