అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య ఉన్న గ్రూపుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. రాయలసీమ ప్రాజెక్టుల అంశంపై టీడీపీ నేతలు రెండు రోజుల పాటు సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు.  రాయలసీమకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ హాజరవుతారని ప్రకటించారు. అయితే ఈ సమావేశంపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. కార్యకర్తలను పట్టించుకోని నేతలంతా ఇప్పుడు సదస్సులంటూ బయలుదేరారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


కార్యకర్తలను పట్టించుకోకుండా ప్రాజెక్టుల సదస్సులేమిటన్న జేసీ ప్రభాకర్ !


తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెండేళ్ల నుంచి ఏ ఒక్క నేతా పట్టించుకోలేదని.. ఇప్పుడు నీటి ప్రాజెక్టులపై సదస్సులు అంటే కార్యకర్తలు వస్తారా అని ప్రశ్నించారు. కార్యకర్తలకు అండగా ఉండేందుకు సదస్సులు పెట్టాలి కానీ.. నీటి ప్రాజెక్టుల పేరుపై కాదని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో ఇద్దరు నేతల కనుసన్నల్లో సదస్సు జరుగుతోందని వారికి పోలీసులు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. నారా లోకేష్ నర్సరావుపేట పర్యటనకు వెళ్తూంటే పోలీసులు అడ్డుకున్నారని కానీ అనంతపురంలో మాత్రం ప్రాజెక్టుల సదస్సంటే ఎలా పర్మిషన్ ఇచ్చారని ప్రశ్నించారు. ఇక్కడ నాయకులు పోలీసులతో కుమ్మక్కయ్యారు కాబట్టే అనుమతించారని ఆరోపించారు. 


టీడీపీ నేతలు పోలీసులతో కుమ్మక్కయ్యారని ఆగ్రహం ! 


 అనంతపురం జిల్లాలో టీడీపీకి ఓటు బ్యాంక్ ఉంది కాబట్టే తాము నాయకులమయ్యామని .. కానీ ఆ కార్యకర్తలకు ఒక్కరంటే ఒక్క నాయకుడు కూడా అండగా లేరని ఆరోపించారు. కార్యకర్తల కోసం మీటింగ్ లో పెట్టాలి గాని ఇలాంటి పనికిరాని సదస్సులు శుద్ధ దండగేనని జేసీ ప్రభాకర్ రెడ్డి కుండబద్దలు కొట్టారు.  ఈ ప్రాజెక్టులపైన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని పార్టీలు పోరాడాయి ఏమన్నా ఫలితం ఉందా అని ప్రశ్నించారు.  అనంతపురం జిల్లా అంటే టీడీపీకి కంచుకోట.. కానీ ఇతర నాయకులు దీనిని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. 


ఇద్దరు నేతలు టీడీపీని నాశనం చేస్తున్నారని జేసీ ప్రభాకర్ విమర్శలు


గత మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద టీడీపీ గెల్చుకున్న ఒకే ఒక్క మున్సిపాలిటీ తాడిపత్రి మాత్రమే. కార్యకర్తలను పట్టించుకుంటే అనేక చోట్ల టీడీపీ గెలుపొందేదని కానీ ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన చెబుతూ వస్తున్నారు. అందరూ కేసులకు  భయపడుతున్నారని ఆయన అంటున్నారు. ఇప్పుడు అదే కారణంగా సొంత పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా విరుచుకుపడటానికి కారణాలు ఉన్నాయి. టీడీపీ నేతలు కేసులకు భయపడి పెద్దగా పోరాడటం లేదని.. అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు పెట్టి పబ్లిసిటీ చేసుకుంటున్నారని ఆయన ఆగ్రహంతో ఉన్నారు. అదే సమయంలో జిల్లాలోని ఇతర టీడీపీ నేతలతో ఆయనకు సరిపడటం లేదు. ఈ కారణంగానే ఆయన సదస్సుపై మండిపడినట్లుగా తెలుస్తోంది.